Jyotiba Phule Comment : మహనీయుడికి మరణం లేదు
జ్యోతిబా పూలే చిరస్మరణీయుడు
Jyotiba Phule Comment : ఈ దేశంలో గర్వించదగిన మహానుభావులలో అగ్రగణ్యుడు జ్యోతిబా పూలే. సమాజంలో అందరూ సమానమని, ప్రతి ఒక్కరికీ చదువు ఉండాలని కోరుకున్న మహనీయుడు. తరాలు మారినా, టెక్నాలజీ విస్తరించినా ఇంకా ఈ దేశంలో కులం అడ్డుగోడలా మారింది. అదే అంతటా ఆక్టోపస్ లా విస్తరించింది. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది.
ఇప్పటికీ అగ్రకుల జాడ్యం ఆధిపత్యం వహిస్తోంది. వివక్షను, కుల వ్యవస్థను నిరసించిన వాడు జ్యోతి బా పూలే. అంతే కాదు మహిళలు మనుషులేనని వారికి విద్య అవసరమని ఆనాడే భావించిన మహోన్నత మానవుడు జ్యోతిబా పూలే.
సామాజిక తత్వవేత్తగా, ఉద్యమ కారుడిగా , సంఘ సేవకుడిగా తన జీవితాన్ని అంకితం చేశాడు. అందుకే ఆయనను ఈ దేశంలో విద్యా ప్రదాతగా భావిస్తారు. పేదలు, బహుజనులకు చదువు ఒక్కటే ఆయుధమని నమ్మారు.
జ్యోతీరావ్ గోవిందరావు పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న పుట్టారు. పూల వ్యాపారం చేయడంతో ఆయన ఇంటి పేరు పూలేగా మారి పోయింది.
ఏడాది లోపే తల్లిని కోల్పోయారు పూలే. మరాఠీ పాఠశాలలో చదివాడు. కానీ తండ్రి కోసం పొలం పనుల్లోకి వెళ్లాడు. కానీ చదువంటే జ్యోతిబా పూలేకు ప్రాణం. లాంతరు పెట్టుకుని ప్రపంచాన్ని చదివాడు.
అతడికి ఉన్న శ్రద్దను చూసి పక్కనే ఉన్న ముస్లిం టీచర్ అబ్బుర పడ్డాడు. చదువుకునేలా ప్రోత్సహించాడు. 1841లో స్కాటిష్ మిషన్ స్కూల్ లో చేర్పించాడు పూలేను. గోవింద్ అనే బ్రాహ్మణుడితో పరిచయం కలిగింది. అది స్నేహంగా మారింది. పూలేకు బాల్యం నుంచే శివాజీ, జార్జి వాషింగ్టన్ అంటే ఇష్టం.
థామస్ రాసిన మానవ హక్కులు పుస్తకం ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది. వీటి కారణంగానే జ్యోతి బా పూలే గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్ భోంస్లే యాంఛ, విద్యా కాథాతిల్, బ్రాహ్మణ్ పంతోజి పేరుతో రాశారు.
13 ఏళ్ల వయస్సులో సావిత్రి బాయితో వివాహం జరిగింది. ఇదే సమయంలో పూలే కుల వివక్షకు గురయ్యాడు. దీంతో ఆనాటి నుంచే బ్రాహ్మణులను విమర్శించాడు.
సమాజంలో వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. జ్ఞానం అందరికీ చెందాలని కోరాడు. సామాన్యులు చదువుకోవాలని కోరాడు. ఆపై మహిళలు విద్యావంతులు కావాలని పిలుపునిచ్చాడు. తన భార్య సావిత్రిని బడికి పంపాడు.
1848లో బాలికల బడిని స్థాపించాడు పూలే. అన్ని కులాల వారికి చదువు చెప్పించాడు. ఇతరులు పాఠాలు బోధించేందుకు రాలేదు. కానీ తన భార్యకే పాఠాలు నేర్పాడు.
ఆమెను టీచర్ గా తయారు చేశాడు. ఒకానొక దశలో ఆర్థికంగా తట్టుకోలేక నడపలేక పోయాడు. స్నేహితుల సాయంతో పునః ప్రారంభించాడు పూలే. 1851-52లో రెండు బడుల్ని ప్రారంభించాడు. ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పు పట్టాడు. బాల్య వివాహాలను నిరసించాడు. తానే వితంతువులకు పెళ్లిళ్లు జరిపించాడు.
వితంతువులకు అండగా నిలిచాడు. బ్రాహ్మణ వితంతువు కొడుకును దత్తత తీసుకున్నాడు పూలే(Jyotiba Phule). 1873 సెప్టెంబర్ 24న సత్య శోధక సమాజాన్ని స్థాపించాడు.
భారత దేశంలో ఇదే తొలి సంస్కరణ ఉద్యమం. వేదాలను వ్యతిరేకించాడు. విగ్రహారాధనను ఖండించాడు పూలే. స్త్రీ, పురుషులు సమానులేనని అందరికీ స్వేచ్ఛ సమానమని స్పష్టం చేశాడు.
వితంతువుల పిల్లల కోసం సేవా సదనం ప్రారంభించాడు. పౌరోహిత్యం దాని బండారం పేరుతో పుస్తకం రాశాడు. 1877లో దీన బంధు పేరుతో వార పత్రికను ప్రారంభించాడు.
1880లో భారత దేశంలో ట్రేడ్ యూనియన్ల ఉద్యమానికి ఆద్యుడిగా భావించే లోఖాండేతో కలిసి రైతులు, కార్మికులను సంఘటితం చేసేందుకు యత్నించాడు జ్యోతిబా పూలే. 1883లో సేద్యగాడి చెర్నకోల రాశాడు. 1885లో సత్య సారాశం ప్రచురించాడు.
వార్నింగ్ పేరుతో ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం, బ్రాహ్మణీయ సంస్థలపై యుద్దం ప్రకటించాడు పూలే. సార్వ జనిక్ సత్య ధర్మ పుస్తకం చాతుర్వర్ణ
వ్యవస్థను నిరసించాడు. మద్యపానాన్ని వ్యతిరేకించాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం అని ప్రకటించాడు.
మహాత్మా జ్యోతిరావు పూలేను(Jyotiba Phule) తన గురువు అని ప్రకటించాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. జీవితాంతం సమ
సమాజ స్థాపన కోసం పరితపించిన మహోన్నత మానవుడు నవంబర్ 28, 1890లో కన్ను మూశారు.
Also Read : తెలుగు భాషా వైభవం బ్రౌన్ స్మృతి పథం