Kandukuru Stampede Comment : ఊపిరి ఆగింది గుండె పగిలింది
కన్నీళ్లు మిగిల్చిన కందుకూరు ఘటన
Kandukuru Stampede Comment : ఒక్కోసారి మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో..ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు. దానిని తప్పించుకోలేరు కూడా. అనుకోకుండా పలకరించే దానిని విధి అంటూ ఊరుకోవడానికి వీలు లేదు. కానీ మరణం కంటే విలువైనది జీవితం.
మరి ఉన్న ప్రాణాలు గాల్లో కలిసి పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు. అజాగ్రత్త, ఎదుటి వారి పట్ల నమ్మకం, అచంచలమైన విశ్వాసం చివరకు శ్వాసను కోల్పోయేలా చేస్తాయి.ఇలాంటి వాటిలో లెక్కకు మించిన ప్రమాదాలు కోకొల్లలు.
అభివృద్ది పేరుతో మనిషి సృష్టించుకున్న రహదారులు ఇప్పుడు రక్తపు ఛారలతో దర్శనమిస్తున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాలను పక్కన పెడితే , తుపాను బీభత్సానికి, చడీ చెప్పుడు లేకుండా వచ్చే భూకంపాల గురించి చెప్పాల్సిన పని లేదు.
సంస్థల నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు వచ్చేలా చేస్తుంది. గుజరాత్ లో బ్రిడ్జి కుప్ప కూలింది. 134 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాదిలో అతి పెద్ద విషాదం. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కందుకూరు లో చోటు చేసుకున్న ఘటన(Kandukuru Stampede) కలిచి వేసింది. ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టేలా చేసింది. రాజకీయాలను కొద్ది సేపు పక్కన పెడితే జరిగిందిన మాత్రం అత్యంత బాధాకరం.
వాళ్లంతా పేదలు అయినా ఉండాలి లేదా తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటులైనా ఉండాలి. ఇదేం ఖర్మ పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో కందుకూరులో సభ యధావిధిగా నిర్వహించారు. కానీ ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. చివరకు తొక్కిసలాట చోటు చేసుకుంది.
సభా ప్రాంగణం పక్కనే కాలువ ఉండడం, అందులో అదుపు తప్పి పడి పోవడంతో ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రికి తరలించినా లాభం లేక పోయింది. చంద్రబాబుతో పాటు ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు..నష్ట పరిహారం ప్రకటించారు. ఇదంతా పక్కన పెడితే త్వరలో దేశంలో, రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
పాదయాత్రల కాలం పోటా పోటీగా కొనసాగుతోంది. ఎవరి ప్రయత్నాలలో వాళ్లు మునిగి పోయారు. కానీ ప్రజలు ముందు వెనుకా ఆలోచించి హాజరు కావాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఆయా పార్టీలకు తప్పనిసరిగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉండడం సర్వ సాధారణం. కానీ కాసిన్ని డబ్బుల కోసం ప్రాణాలు పోయేంతగా తమను తాము అర్పించు కోవాల్సిన అవసరం ఉందా అన్నది ప్రజలు ఆలోచించాలి.
ఇకనైనా ఆయా ప్రభుత్వాలు ..పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, పాదయాత్రల పట్ల జాగ్రత్తలు పాటించేలా చర్యలు(Kandukuru Stampede) తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం లేక పోలేదు.
పార్టీల కంటే..ప్రభుత్వాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం..అన్నది వాస్తవం. కందుకూరు ఘటనలో అసువులు బాసిన వారికి అశ్రునివాళి తప్ప ఇంకేం ఇవ్వలేం.
Also Read : నయీం అనుచరుడు శేషన్నపై పీడీ యాక్ట్