కన్నడ నాట ఏం జరగ బోతోంది. ఎవరు కింగ్ మేకర్స్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. 224 అసెంబ్లీ స్థానాలకు గాను 2,516 మంది అభ్యర్థులు నిలిచారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మే 10న పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఫలితాలే. 13న విజేతలు ఎవరో తేలుతుంది. పరాజితులు ఎవరనేది అర్థమై పోతుంది. ఇది పక్కన పెడితే నువ్వా నేనా అన్న రీతిలో ఈసారి ఎన్నికలు జరిగాయి. బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నీ తామై వ్యవహరించారు.
పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ సీఎం, రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన బీఎస్ యడ్యూరప్ప సైతం విస్తృతంగా ప్రయత్నించారు. రోడ్ షోలు, ర్యాలీలు, భారీ ఎత్తున బహిరంగ సభలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హోరెత్తించింది బీజేపీ. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఎన్నడూ లేనంతగా కన్నడ రాష్ట్రాన్ని జల్లెడ పట్టారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రానికి బీజేపీ నుంచి బస్వరాజ్ బొమ్మై సీఎంగా ఉన్నా ఆయన ప్రభావం ఎక్కడా కనిపించ లేదు. పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో విడుదల చేసినా చివరకు కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతోనే సరి పోయింది.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలని ప్రయత్నం చేసింది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో సక్సెస్ అయ్యింది. పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్. మాజీ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర ఇంఛార్జ్ రణ్ దీప్ సూర్జేవాలా పక్కా ప్లాన్ తో వ్యవహరించారు. విమర్శలు , ఆరోపణలు చేయడం కంటే వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం ఎలా తప్పుడు నిర్ణయాలు తీసుకుందో వాస్తవంగా ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. పార్టీ తరపున ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పార్టీని తమ భుజాలపై మోశారు. పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఆకట్టుకున్నా అందులో బజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామన్న ప్రకటన కొంత మేర ఇబ్బంది కలిగించింది. దీనినే ఫోకస్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది.
ఇక జేడీఎస్ చీఫ్ , మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి ఒకే ఒక్కడై అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనంటూ , కర్ణాటకకు ఆయా పార్టీలు చేసిన అభివృద్ది ఏమిటో చెప్పాలంటూ నిలదీశారు. ఇదే సమయంలో ఓటు బ్యాంకు కొల్ల గొట్టేందుకు ఆప్, ఎంఐఎంతో పాటు మరో ముస్లిం పార్టీ ఎన్నికల బరిలో ఉండడం బీజేపీకి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ పరంగా చూస్తే కాంగ్రెస్, బీజేపీ పేర్లు వినిపిస్తున్నా హంగ్ ఖాయమని జేడీఎస్ కీలకంగా మారనుందని అంచనా. ఎవరు కింగ్ పిన్ అవుతారనేది తేలాలంటే పలితాలు వచ్చేంత దాకా వెయిట్ చేయాల్సిందే.
