Kerala Governor: కేరళ గవర్నర్ ధర్నా !
కేరళ గవర్నర్ ధర్నా !
Kerala Governor: కేరళ ప్రభుత్వం, గవర్నర్ మధ్య బేదాభిప్రాయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి… చివరకు సాక్ష్యాత్తూ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నడిరోడ్డుపై ధర్నాకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… కొల్లం జిల్లా నీలమేల్ లో ఓ కార్యక్రమానికి వెళ్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కాన్వాయ్ ను… అధికార సీపీఎం పార్టీకు అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలిపారు.
Kerala Governor Strike Viral
దీనిపై ఆగ్రహించిన గవర్నర్ ఆరీఫ్ ఖాన్ ఒక్కసారిగా తన వాహనం నుండి క్రిందికి దిగారు… సమీపంలోని ఉన్న ఓ టీ స్టాల్ వద్దకు వెళ్ళి కుర్చీ తెచ్చుకుని రోడ్డు ప్రక్కన బైఠాయించారు. తన కాన్వాయ్ వద్ద నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తూ ఆయన రోడ్డు ప్రక్కన బైఠాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆరిఫ్ ఖాన్(Kerala Governor)… పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు ఇప్పటివరకు 13 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు చెప్పగా, మిగతా వారి సంగతేమిటి? అని గవర్నర్ వారిని ప్రశ్నించారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి… రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం గవర్నర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయ్ విజయన్ ల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కొల్లం జిల్లా నీలమేల్ లో గవర్నర్ తీరుకు నిరసనగా అధికార సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నల్ల జెండాలను ప్రదర్శించారు. గవర్నర్ కాన్వాయ్ ను నిరసన కారులు అడ్డుకున్న నేపథ్యంలో గవర్నర్ భద్రతను పెంచుతూ కేంద్ర హోం శాఖ జడ్ ప్లస్ కేటగిరి కేటాయించినట్టు కేరళ రాజ్‌భవన్ వెల్లడించింది.
Also Read : Sangareddy: తెలంగాణలో స్వల్ప భూకంపం ?