Kohli Gambhir Comment : ఇక చాలు..దేశం సిగ్గు పడుతోంది
తల దించుకునేలా చేసిన కోహ్లీ..గంభీర్
Kohli Gambhir Comment : కోట్లకు పడగలెత్తిన వాళ్లు. దేశాన్ని ప్రభావితం చేస్తున్న వాళ్లు. క్రికెట్ ఆటకు వన్నె తీసుకు వచ్చిన వాళ్లు. చివరకు మైదానంలో కొట్టుకునేంత స్థాయికి దిగజారారు. సభ్య సమాజం..యావత్ భారతం తల దించుకునేలా చేసింది విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ల ప్రవర్తన. వ్యక్తిగతంగా ద్వేషం ఉండవచ్చు. అంతకు మించి అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కాదనలేం. మనుషులన్నాక భావోద్వేగాలు సహజం. కానీ వ్యక్తిగత ప్రతిష్టకు పోయి చిల్లరగా ప్రవర్తించడం తట్టుకోలేక పోతోంది క్రీడా లోకం.
ఓ వైపు తమకు ప్రాణాలకు రక్షణ లేదని, తాము లైంగిక వేధింపులకు గురవుతున్నామంటూ , డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్ల ఆవేదనను అర్థం చేసుకునే నాథుడే లేకుండా పోయాడు. కానీ ప్రస్తుత క్రికెటర్ , మాజీ క్రికెటర్ మధ్య చోటు చేసుకున్న ఘటన మాత్రం దేశాన్ని విస్తు పోయేలా చేసింది. గతంలో ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ చేశాడు భారత క్రికెటర్ల గురించి. వాళ్లకు దేశం కంటే, ఆట కంటే ప్రకటనలు, డబ్బులకే ప్రయారిటీ ఇస్తారని.
ఇది పక్కన పెడితే కోహ్లీ, గంభీర్(Kohli Gambhir Comment) ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ భారత దేశం తరపున ఆడిన వారే. ఐపీఎల్ లో కూడా ప్రాతినిధ్యం వహించిన వారే. కోహ్లీ ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నాడు. మరో వైపు గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా ఉన్నాడు. ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీగా గెలుపొందాడు. ఇవాళ బీసీసీఐలో ఎక్కువ శాతం బీజేపీకి చెందిన వారే కొలువు తీరారు. ఒక రకంగా చెప్పాలంటే అది బీసీసీఐ కాదు బీజేపీ ఆఫీసు అని టీఎంసీ ఎంపీ ఆ మధ్యన కామెంట్స్ కూడా చేశారు.
ఇవాళ ఇద్దరి గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వస్తోందంటే. ఈ దేశంలో క్రికెట్ అంటే ఓ మతం. అదే సర్వస్వం. దానిని ప్రేమించే వాళ్లు, ఆరాధించే వాళ్లు కోట్లల్లో ఉంటారు. క్రికెటర్లను దేవుళ్లుగా భావిస్తారు. వాళ్ల కోసం ఏమైనా చేస్తారు. అందుకే కార్పొరేట్ కంపెనీలు కోట్లు కురిపిస్తున్నాయి. జిమ్మిక్కులతో మైమరిచి పోయేలా చేస్తున్నాయి. ప్రపంచ క్రికెట్ రంగాన్ని బీసీసీఐ శాసించే స్థాయికి చేరుకుంది. యువతకు, వర్దమాన క్రీడాకారులకు ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన వాళ్లు ఇలా మైదానంలో గొడవ పడేంత దాకా వెళ్లారంటే ఏమని అనుకోవాలి.
చిన్న తప్పు చేస్తే వేటు వేసే బీసీసీఐ ఎందుకని కేవలం జరిమానాతో సరి పెట్టింది. దాని వెనుక రాజకీయాలు ఉన్నాయా. ఇప్పటికే సెలెక్షన్ కమిటీ తీరుపై సర్వత్రా విమర్శలు ఉన్నాయి. పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఏ క్రికెటర్ ఇప్పుడు జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ లేదన్నది బహిరంగ రహస్యం. మ్యాచ్ ఫీజులో 100 శాతం కోహ్లీ, గంభీర్ కు విధిస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ.
ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదు. ఈ దేశంలో క్రికెటర్లయినా లేదా ఏ క్రీడాకారుడైనా సరే దేశానికి, చట్టానికి లోబడి ఉండాల్సిందే. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. కోహ్లీ, గంభీర్ లు(Kohli Gambhir Comment) గొప్ప క్రికెటర్లు కావచ్చు గాక..కానీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేని వాళ్లు రేపు ఎలా దేశం జెండాను కప్పుకునేందుకు ఇష్ట పడతారా అన్నది ప్రశ్న. ఏది ఏమైనా ఇది మంచి పద్దతి కాదు. ఇకనైనా కోహ్లీ, గంభీర్ మారాలి. క్రీడా స్పూర్తిని చాటాలి.
Also Read : దమ్ముంటే నన్ను నిషేధించండి