KTR Amara Raja : తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడి
రూ. 9,500 కోట్ల పెట్టుబడుల ప్రకటన
KTR Amara Raja : తెలంగాణలో గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. రాబోయే పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ వెల్లడించింది. అత్యాధునిక సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
అమర్ రాజా లిథియం అయాన్ గిగా పరిశ్రమగా రూపు దిద్దుకోనుంది. శుక్రవారం అమర్ రాజా గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ తో పాటు మంత్రి కేటీఆర్ , కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అమర్ రాజా గురించి కితాబు ఇచ్చారు. గత 37 సంవత్సరాలుగా అద్భుతమైన సేవలు అందిస్తోందని ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా గత ఎనిమిదేళ్లుగా తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరుస్తోందని చెప్పారు కేటీఆర్.
ఎవరు పెట్టుబడి పెట్టేందుకు వచ్చినా తాము స్వాగతం పలుకుతామని స్పష్టం చేశారు. బ్యాటరీల తయారీలో అమర్ రాజా అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్ (KTR Amara Raja). ఈవీ బ్యాటరీల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణలో ఏర్పాటు చేయబోయేది అతి పెద్ద యూనిట్ అని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా అమర్ రాజా కంపెనీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద తాము ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ చెప్పారు.
ఈ పరిశ్రమ వల్ల వందలాది మంది యువతకు ఉపాధి కలుగుతుందన్నారు.
Also Read : న్యూయార్క్..సింగపూర్ ఖరీదైన నగరాలు