KTR : కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలమంటూ నిప్పులు చెరిగిన కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నయ్....

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయ్యారని ధ్వజమెత్తారు.

‘‘ కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం.. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్. తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్లముందే.. ఢమాల్. ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం ఇది..! దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో.. ఎనిమిది నెలల్లోనే.. ఎందుకింత వ్యవసాయ విధ్వంసం..? సంతోషంగా సాగిన సాగులో.. ఎందుకింత సంక్షోభం..?? మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్. నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్. నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్. రుణమాఫీ అని మభ్యపెట్టి.. పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడంతోనే రైతులకు ఈ అవస్థ.. రూ.500 బోనస్ అని.. నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ’’ అని కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR Slams

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నయ్.. కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు.. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు… అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి.. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు.. రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు.. చెరువులకు మళ్లించే తెలివి లేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనలో.. రైతు బతుకుకు భరోసానే లేదు. బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదు.. ఎరువులు -విత్తనాల కోసం రైతులకు తిప్పలు.. క్యూలైన్‌లో పాసుపుస్తకాలు, చెప్పులు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే.. పగలూ రాత్రి తేడా లేకుండా పడిగాపులు. అప్పుల బాధతో.. అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు. ఇలా.. ఒకటా.. రెండా.. సాగు విస్తీర్ణం తగ్గడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి’’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : CM Siddaramaiah : రేపు తుంగభద్ర డ్యామ్ ను సందర్శించనున్న కర్ణాటక ముఖ్యమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!