రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 112 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవి చూసింది. కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే చాప చుట్టేసింది. ఐపీఎల్ సీజన్ 16లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టుగా నిలిచింది. ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే డబుల్ డిజిట్స్ కు పరిమితమయ్యారు. జో రూట్ 10 రన్స్ చేస్తే షిమ్రోన్ హిట్మెయర్ 35 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు తప్ప ఏ ఒక్క ఆటగాడు రాణించలేదు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ సంజూ శాంసన్ లేని షాట్ కోసం పోయి 4 రన్స్ కే వెనుదిరిగాడు.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ , క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మీడియాతో మాట్లాడాడు. ఆర్సీబీ ఆటగాళ్లు అద్భుతంగా రాణించడం పక్కన పెడితే మా ఆటగాళ్లు తమంతకు తాముగా వికెట్లను పారేసుకున్నారని పేర్కొన్నాడు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తుందని తెలిపాడు. సీజన్ ఆరంభంలో టాప్ లో ఉన్న జట్టు ఉన్నట్టుండి ఇలా కావడం తనను కూడా విస్తు పోయేలా చేసిందన్నాడు కుమార సంగక్కర.
ఇదిలా ఉండగా సీజన్ లో ఇప్పటి దాకా రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లు ఆడింది. ఇంక కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉందని దీంతో ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా అడుగంటి పోయినట్లేనని పేర్కొన్నాడు హెడ్ కోచ్. ఇది తమ తప్పిదమని ఒప్పుకున్నాడు. ఇకనైనా జట్టు ఆట తీరు మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.