LIC SBI Adani Comment : ఈ ప్రశ్నకు బదులేది..?
అన్నీ అమ్మేసుకుంటూ పోతే ఎలా
LIC SBI Adani Comment : కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవు. కొన్ని ఆన్సర్స్ కు ప్రశ్నలు అతకవు. ఇవాళ మరోసారి అదానీ హిండెన్ బర్గ్ వివాదం మరింత ముదిరింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా అదానీ పై పల్లెత్తు మాట అననీయడం లేదు కొలువు తీరిన సర్కార్.
రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడి సంపాదించిన డబ్బులు కష్ట కాలంలో అవసరానికి వస్తాయని, చనిపోయినా తమ కుటుంబాలకు ఆలంబనగా ఉంటుందని కోట్లాది మంది ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలలో ప్రజలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వాటికి గతంలో భద్రత ఉండేది.
కానీ ఇప్పుడు ఏ సంస్థకు భరోసా లేదు. రోజు రోజుకు సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి ఉన్న వాటిని గంప గుత్తగా అమ్ముకుంటూ పోతున్నారు. దీనిని అడిగే నాథుడే లేరు. విచిత్రం ఏమిటంటే నష్టాలు వస్తున్నాయనే సాకుతో తమ వారికి కేటాయిస్తూ వెళుతున్నారు. ఈ సమయంలో మరోసారి గౌతం అదానీ ప్రశ్నార్థకంగా మారారు.
భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) (LIC SBI Adani Comment) రెండూ దేశంలో టాప్ లో కొనసాగుతున్నాయి.
వాటిలో ఉన్న కోట్లాది డబ్బులే కాదు అంతకు మించిన విలువ కలిగిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఎవరైనా నష్టాల్లో ఉంటే వాటికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తారు.
కానీ మోదీ ప్రభుత్వం 2014 నుంచి నేటి దాకా అమ్మకంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈరోజు వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.
నిన్నటి దాకా అదానీని వెనకేసుకుంటూ వచ్చిన సర్కార్ ఇవాళ అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు విల విల లాడుతోంది. విచిత్రం ఏమిటంటే మోదీ ది క్వశ్చన్ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై నిషేధం విధించిన ప్రభుత్వం అదానీ గ్రూప్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, మోసాల గురించి వచ్చినా దాని వైపు కన్నెత్తి చూడలేదు. ఇది కాదా పక్షపాతం.
బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో మూడు రోజుల పాటు ఐటీ సోదాలు చేపట్టింది. కానీ అదానీ వైపు కన్నెత్తి చూడలేదు. మరి ఎల్ఐసీ, ఎస్బీఐలు ఏకంగా రూ. 22,000 కోట్లు అదానీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టాయి. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు విత్త మంత్రి నిర్మలా సీతారామన్.
చివరకు కోట్లాది మంది ప్రజలు పెట్టిన పెట్టుబడులకు జవాబు దారి ఎవరు ఉంటారని ప్రశ్నిస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ సందర్బంగా అదానీ గ్రూప్ వ్యవహారంపై ప్యానల్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కార్ ను ఆదేశించింది.
అప్పటి వరకు కానీ మోదీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. విచిత్రం ఏమిటంటే ఎంపిక చేసిన పేర్లను సీల్డ్ కవర్ లో ఇస్తామని చెప్పింది. దానిని సీజేఐ తో కూడిన ధర్మాసనం ఒప్పుకోలేదు.
మొత్తంగా ఎల్ఐసీ, ఎస్బీఐలను అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేయమని ఎవరి ఒత్తిడి తెచ్చారు..వారి వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
Also Read : తీసుకుంటాం కానీ తొలగించం – టీసీఎస్