Minister Dola : ఇంటర్ విద్యార్థిని ‘అర్చిత’ ఆత్మహత్యపై విచారణకు ఆదేశించిన మంత్రి
అయితే ఘటనపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి స్పందించారు...
Minister Dola : శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబ సభ్యులకు మంత్రి డోలా ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో నిమ్మక అర్చిత ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. యువతి స్వస్థలం కొత్తూరు మండలం మహాసింగి గ్రామం. అయితే ఏం జరిగింతో ఏమో తెలియదు గానీ మంగళవారం రాత్రి స్నానాల గదిలో కిటికీకి ఆమె ఉరేసుకుంది. ఇది చూసిన తోటి విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం వసతి గృహం సిబ్బందికి తెలపగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న నందిగాం పోలీసులు.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Minister Dola Comment
అయితే ఘటనపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola) స్పందించారు. యువతి ఆత్మహత్య తీవ్రంగా కలచివేసినట్లు ఆయన చెప్పారు. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఆయన మాట్లాడారు. విచారణ చేపట్టి పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. విద్యార్థిని అర్చిత మృతి విచారకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మనోధైర్యం కోల్పోవద్దని, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. జీవితంలో ఎదురయ్యే తాత్కాలిక సమస్యలకు భయపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
Also Read : CM Chandrababu : ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్న బాబు