MLA KTR : పెంటవెల్లిలో 499 మంది రైతులు ఉండగా ఏ ఒక్కరికి రుణమాఫీ కాలేదు

పెంటవెల్లిలో 499 మంది రైతులు ఉండగా ఏ ఒక్కరికి రుణమాఫీ కాలేదు..

MLA KTR : స్వాతంత్ర్య భారతదేశంలోనే రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అతి పెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రైతులను నిండా ముంచారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణే నాగర్ కర్నూల్ జిల్లా పెంటవెల్లి గ్రామమని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. పెంటవెల్లిలో 499మంది రైతులు ఉండగా.. ఏ ఒక్కరికీ రుణమాఫీ కాకపోవటం దారుణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేటీఆర్(MLA KTR) ట్విటర్‌లో నిప్పులు చెరిగారు. రుణమాఫీ పూర్తిచేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రివి బూటకపు మాటలని చెప్పడానికి ఈ గ్రామమే సజీవ సాక్ష్యమని చెప్పుకొచ్చారు. అంత మంది రైతులు ఉన్న పెంటవెల్లిలో ఒక్కరంటే ఒక్కరికీ మాఫీ కాకపోవడం పచ్చి మోసం కాక మరేమిటంటూ ప్రశ్నలు సంధించారు. గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 దాకా డెడ్ లైన్లు పెట్టుకుంటూ వచ్చిన సీఎం ఈ గ్రామ రైతులకు ఎందుకు మాఫీ కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

MLA KTR Comment

పావుశాతం కూడా రుణమాఫీ చేయకుండా వందశాతం అయిపోయినట్టు సీఎం ఫోజులు కొడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంట్లవెల్లి రైతులకు రుణమాఫీ చేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు పెంటవెల్లి గ్రామ రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన తెలుపుతున్న వార్తాపత్రిక క్లిప్‌ను ట్వీట్‌కు కేటీఆర్ జతచేశారు.

Also Read : Deputy CM Bhatti : కేంద్రం తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి సాయం చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!