MLA Seethakka : వెంకట్ రెడ్డిపై సీతక్క సీరియస్
కావాలనుకుంటే బీజేపీ కండువా కప్పుకో
MLA Seethakka : కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆయన పేరుతో విడుదలైన ఆడియో కలకలం రేపింది. దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాల్సిందిగా ఏఐసీసీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్కడ పార్టీ గెలవదని, డబ్బులు లేవని, ఓడి పోయే సీటుకు తాను వెళ్లి ప్రచారం చేసినా ఏమీ ఉండదన్నారు వెంకట్ రెడ్డి.
ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. పార్టీకి చెందిన నాయకుడే ఇలా మాట్లాడితే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఎలా పని చేస్తారంటూ ప్రశ్నించారు అదే పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka). మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉంటూ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎలా సపోర్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు.
ఇదేనా రాజకీయం అంటే అని నిలదీశారు. ఉప ఎన్నికలో పార్టీ రూల్స్ కు విరుద్దంగా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్య తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. తల్లి పాలు తాగి చేటు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోతారని మండిపడ్డారు. రాజకీయాల్లో బంధుత్వాలు వేరని ఒకవేళ ఉంటే రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరితే బెటర్ అని సూచించారు.
ఈ పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఎలా గెలిపించాలని ప్రచారం చేస్తారంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే సీతక్క. కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్యగా ఆమె అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఎంపీ వెంకట్ రెడ్డి జవాబు చెప్పాల్సిందేనంటూ స్పష్టం చేశారు.
Also Read : ఆలయాలపై సూర్యగ్రహణం ఎఫెక్ట్