MLC Elections: రసవత్తరంగా హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక !

రసవత్తరంగా హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక !

MLC Elections : హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ఓటర్ల (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) బలం ఎంఐఎం (మజ్లిస్‌)కే ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి గెలవడం నల్లేరు మీద నడకేనని, ఆ లెక్కన మిగతా పార్టీలేవీ కూడా తమ అభ్యర్థిని కూడా బరిలో దింపకుండా ఎన్నిక ఏకగ్రీవమే కాగలదని ఇప్పటిదాకా అందరూ భావించారు. కాని నామినేషన్ల చివరి రోజున ఊహించని విధంగా బీజేపీ(BJP) కూడా తమ అభ్యర్థిని బరిలో దింపడంతో పోలింగ్‌ నాటికి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల్లో తమ పార్టీకి బలం లేదన్నది బీజేపీకి తెలియనిది కాదు… అయినా రంగంలోకి దిగిందంటే లోపాయికారీగా ఏదో జరుగుతోందన్న ప్రచారానికి తావిస్తోంది. జీహెచ్‌ఎంసీలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 వార్డులున్నప్పటికీ, ఈ ‘స్థానిక’ ఎన్నికల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 81 కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దీనితో పాటు ఈ స్థానిక సంస్థలో ఓటేసేందుకు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్లుగా బీజేపీ నుంచి తాజాగా ఒక రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, ఇద్దరు ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు చేరారు. ఓటర్లుగా చేరేందుకు ఇక ఎవరికీ అవకాశం లేదు. గడువు ముగిసిపోయింది.

MLC Elections – రాబోయే మేయర్‌ స్థానంకోసం కాంగ్రెస్, మజ్లిస్ మిలాఖత్ ?

ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్‌ ఇంకా ప్రమాణం చేయనందున వారు ఓటర్లు కాలేదని సమాచారం. తాజా సమాచారం మేరకు అన్ని పార్టీల కంటే ఎంఐఎంకే ఎక్కువ బలం ఉంది. ఆ పార్టీకి చెందిన ఓటర్లు 49 మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో బీజేపీ(BJP), బీఆర్‌ఎస్‌లు(BRS) ఉన్నాయి. కాంగ్రెస్‌(Congress) ఎలాగూ తమ అభ్యర్థిని బరిలోకి దింపదని, ఎంఐఎంకు మద్దతునిస్తుందని, రాబోయే జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని ఈ అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా… ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలో దించకుండా కాంగ్రెస్‌కు మద్దతునట్లుగానే అందరూ భావిస్తున్నారు.

మద్దతు కూడగట్టే పనిలో బీజేపీ

మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఎంఐఎంతో పోరాడి గెలిచేందుకు తాము ఇతర పార్టీల మద్దతు కూడగట్టగలమనే ధీమాలో బీజేపీ ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల ఎన్నికలప్పుడు ఒక పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలో చేరిన వారు కూడా ఎందరో ఉన్నారు. వారిలో ఎందరు ఇప్పుడు తాముంటున్న పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారో చెప్పలేని పరిస్థితి. దాంతో కాంగ్రెస్‌ మద్దతిచ్చే ఎంఐఎంకు ఎందరు ఓటు వేస్తారో కూడా చెప్పలేమంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్‌ కార్పొరేటర్లలో ఉంది.

వాస్తవానికి కార్పొరేటర్‌ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌నుంచి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలిచినప్పటికీ, వారీ ఎన్నికలో ఓటర్లు కారు. ఇక కార్పొరేటర్లలో… బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన కార్పొరేటర్లే కాంగ్రెస్‌ ఓటర్లుగా ఉన్నారు. ఇలా వివిధ అంశాలు, వ్యక్తిగత పరిచయాలు, అభిమానాలు, తదితరమైన వాటితో తాము బలంగా పోటీనివ్వగలమన్న ధీమాతోనే బీజేపీ బరిలో దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటన్నది కూడా ఆసక్తిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వేటికవిగా మిగతా రెండూ ఒకటేనని ఆరోపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? బీఆర్‌ఎస్‌ ఎటు మొగ్గుచూపనుంది? కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయనున్నాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Also Read : CM Revanth Reddy: కర్ఫ్యూను తలపిస్తున్న కంచ గచ్చిబౌలి ప్రాంతం

Leave A Reply

Your Email Id will not be published!