Monkey Fever in Karnataka: కర్ణాటకలో విజృంభిస్తోన్న ‘మంకీ ఫీవర్’ !
కర్ణాటకలో విజృంభిస్తోన్న ‘మంకీ ఫీవర్’ !
Monkey Fever: కర్ణాటకలో ‘మంకీ ఫీవర్’ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 53 ‘మంకీ ఫీవర్’ కేసులు నమోదవగా… ఇద్దరు ఈ వ్యాది లక్షణాలతో మృతి చెందారు. కర్ణాటకలో తొలి ‘మంకీ ఫీవర్’ కేసు జనవరి 16న నమోదు కాగా… నేటికి ఆ సంఖ్య 53కు చేరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. అక్కడ నివారణ చర్యలు ముమ్మరం చేయాలని తమిళనాడు ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం అన్ని జిల్లాల ఆరోగ్యశాఖ అధికారులకు సర్క్యులర్ పంపారు.
కర్ణాటక(Karnataka) నుండి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలని, జ్వరం, తనొప్పి తదితర సమస్యలతో బాధపడేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలని తమిళనాడు ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం కర్ణాటక సరిహద్దు జిల్లాల అధికారులను ఆదేశించారు. పశువులు ముఖ్యంగా ఆవులు, ఎద్దులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటిని మేత కోసం అడవుల్లోకి పంపకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధికారక సూక్ష్మజీవులను అంతమొందించేలా పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలియజేయాలని ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది.
Monkey Fever – ‘మంకీ ఫీవర్’ అంటే ఏమిటి ?
‘క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ (కే.ఎఫ్.డీ.వీ) అనే ‘మంకీ ఫీవర్’ ను 1957లో గుర్తించారు. కోతులు, పశువుల ద్వారా ఈ వైరస్ మానవులకు వ్యాపించి… ఏడాదికి 400 నుండి 500 మందికి సోకుతున్నట్లు గణాంకాలు చెబతున్నాయి. కోతుల్లో కనిపించే పేలు మనుషులను కాటు వేయడం ద్వారా ఇది మనుషులకు సోకుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. మంకీ ఫీవర్ బారిన పడివారికి ఒక్కసారిగా ఆకస్మికంగా జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయని… వ్యాధి తీవ్రత పెరుగుతున్న సమయంలో వాంతులు, విరేచనాలు తదితర సమస్యలుంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మంకీ ఫీవర్ తీవ్రమైన సందర్భాల్లో ముక్కు నుంచి రక్తస్రావం, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుందని మానసిక గందరగోళం, కొత్తగా నాడీ సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలమీదకు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంకీ ఫీవర్ బారినపడిన సమయంలో లక్షణాలు ముందుగానే గుర్తించి సరైన చికిత్స సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశంలోని కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఎక్కువగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతన్నట్లు తెలుస్తోంది.
Also Read : MRO in ACB Net: 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకు చిక్కిన శామీర్ పేట తహసీల్దార్ !