MS Dhoni Comment : ఓటమి పాఠం సక్సెస్ గుణపాఠం
మిస్టర్ కూల్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో
MS Dhoni Comment : విజేతలు ఎలా ఉంటారు. జనాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఎలా ఉంటారు. వాళ్లు కూడా మామూలుగా మనలాంటి మనుషులే. కానీ భిన్నంగా ఆలోచిస్తారు. తమ దారిన తాము ప్రయాణం చేస్తుంటారు. కన్నీళ్లను తట్టుకుని, కష్టాలను దాటుకుని, గుండెను నిబ్బరం చేసుకుని ముందుకు వెళతారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే గెలుపును అందుకోవడం. ప్రపంచం విస్తు పోయేలా చేయడం. అపజయం పాఠం నేర్పితే ..విజయం గుణ పాఠాన్ని కలుగ చేస్తుందని నమ్ముతారు. ఇది నమ్మలేని వాస్తవం. గెలిచిన ప్రతి వ్యక్తి వెనుక ఎప్పుడో ఒకప్పుడు ఘోరమైన అవమానం దాగి ఉంటుంది. ప్రతి కథకు ముగింపు ఉన్నట్టే ప్రతి సక్సెస్ కు కారణం ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వ్యక్తి. అతడు ఎవరో కాదు లెక్కలేనంత మంది అభిమానులను స్వంతం చేసుకున్న అరుదైన ఆటగాడు జార్ఖండ్ కు చెందిన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).
మైదానంలో ఎలా ఉంటాడో బయట కూడా అలాగే ఉంటాడు. మ్యాచ్ ఏదైనా సరే తనదైన ముద్ర ఉండాల్సిందే. అందుకే ప్రతి వర్ధమాన ఆటగాడు ధోనీని(MS Dhoni) దేవుడిగా కొలుస్తారు. ఆరాధిస్తారు. భారతీయ క్రికెట్ రంగంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ఏకైక ఆటగాడు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, అంతకు మించిన సత్కారాలు. ఆట లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఆటగాడిగా చిరస్మరణీయమైన విజయాలలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గా రికార్డుల మోత మోగించాడు. క్రికెట్ లోకపు వాకిట తనదైన సంతకం చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). బ్యాటర్ , ఫినిషర్ అంతకు మించిన నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే లోక నాయకుడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ లో నిరాశ పరిచిన జట్టును ఈసారి జరిగిన లీగ్ లో అద్భుతమైన టీమ్ గా మార్చేసిన ఘనత ధోనీదే.
ఎప్పుడూ నిండు కుండ లాగా కనిపించే ధోనీ కూడా ఏడ్చాడంటే నమ్మగలమా. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చేసినప్పుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎందుకంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుపై స్కాం ఆరోపణలు రావడాన్ని భరించ లేక పోయాడు. ఇది కదా నిజమైన ఆటగాడికి ఉండాల్సిన లక్షణం. ఇదే సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు 1983 వరల్డ్ కప్ దేశానికి తీసుకు వచ్చిన లివింగ్ లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఏడ్చాడు. ఆ తర్వాత అతడు నిర్దోషిగా బయట పడ్డాడు. ధోనీ వెనుక ఎవరూ లేరు ఒక్క ధోనీ తప్ప.
తన కుటుంబం కంటే తన జట్టును ప్రేమిస్తాడు. అదే అతడిని నిజమైన నాయకుడిని చేసింది. లీడర్ గా మార్చేసింది. కెప్టెన్ గా అత్యధిక విజయాలు అందించేలా తీర్చిదిద్దింది. ధోనీ ఓటమిని ఒప్పుకోడు. అలాగని విజయం వరించిందని గర్వపడడు. రెండింటిని సమానంగా చూస్తాడు. అపజయం ఎదురైనప్పుడు నవ్వుతూ స్వీకరిస్తాడు. తన సహచర ఆటగాళ్లకు భరోసా ఇస్తాడు. మళ్లీ సన్నద్దం చేస్తాడు. ఆపై ప్రత్యర్థి జట్టును అభినందిస్తాడు ధోనీ. అందుకే అతడంటే అందరికీ అంత ఫిదా. క్రికెట్ లోకంలో ఎందరో దిగ్గజ క్రికెటర్లు..కానీ కొందరే ఛాంపియన్లు. వారిలో ఒకే ఒక్కడు ధోనీ..కాదంటారా..
Also Read : Siddaramaiah DK Tour