Nelson Mandela Comment : చరిత్రను సృష్టించే వాళ్లు కొందరు. కానీ తామే చరిత్రగా మారే వాళ్లు ధన్యులు. అలాంటి వారిలో ఎన్నదగిన నాయకులలో నెల్సన్ మండేలా ఒకరు. ఇవాళ ఆయన జయంతి. ఈ లోకాన్ని వీడి పదేళ్లవుతోంది. మరోసారి స్మరించు కోవాల్సిన సమయం ఇది. సందర్భం కూడా. మానవ ఇతిహాస క్రమంలో ఎన్నో మార్పులు..మరెన్నో ఎగుడుదిగుడులు ఉన్నాయి. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అనలేదా మహాకవి శ్రీశ్రీ. ఎక్కడికి వెళ్లినా ఏదో రూపంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అది వివిధ రూపాలలో వ్యక్తం అవుతోంది. అలాంటి వాటికి బలై పోయిన వాళ్లు ఎందరో. చరిత్రకు అందకుండా పోయిన వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కులం, మతం, వర్ణ వివక్ష టెక్నాలజీ విస్తరించిన ఈ సమయంలో , శాస్త్రం ఆధిపత్యం వహిస్తున్న తరుణంలో సైతం తమ ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి.
Nelson Mandela Comment to
ఆక్టోపస్ కంటే వేగంగా, క్యాన్సర్ , ఎయిడ్స్ ,కరోనా భూతం కంటే దారుణంగా సమాజాన్ని, ప్రపంచాన్ని నిట్ట నిలువునా చీల్చుతున్నాయి. శాంతి నా ఆయుధం అంటూ యావత్ లోకాన్ని విస్మయానికి గురి చేశారు మహాత్మా గాంధీ(Mahatma Gandhi). ఆయనను స్పూర్తిగా తీసుకున్న నెల్సన్ మండేలా వర్ణ వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. అంతిమంగా విజయం సాధించారు. కానీ ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మరెన్నో ఛీత్కారాలను భరించారు మండేలా(Nelson Mandela). ఒకటా రెండా ఏకంగా 27 ఏళ్ల పాటు రోబెన్ ద్వీపంలో కారాగార శిక్ష అనుభవించాడు. 1990లో విడుదలయ్యాడు. దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశాడు. ఆయన చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా అత్యున్నత స్థాయి పురస్కారాలు, అవార్డులు కూడా అందుకున్నాడు.
చివరకు నోబెల్ శాంతి బహుమతి(Nobel Price) కూడా. ఆయా దేశాలు ఆయనను గౌరవించేందుకు పోటీ పడ్డాయి. మండేలా తనను తాను మల్చుకున్న తీరు, పోరాడిన వైనం కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచాయి. ఎందరినో ప్రభావితం చేసిన ఈ యోధుడికి గాంధీ ప్రబోధించిన శాంతి నచ్చడం విశేషం. శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే సాధనం తనను ప్రభావితం చేసిందన్నాడు ఒకానొక సందర్భంలో. లోకంలో ఎక్కడ అణచివేత జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలకు మండేలా ఒక చిహ్నంగా, ప్రతీకగా మారారు. నేటికీ హక్కుల పరంగా జేజేలు అందుకుంటున్న అబ్రహం లింకన్ , మార్టిన్ లూథర్ కింగ్ తో పాటు మదిబాను కూడా కొలుస్తున్నారు. నా జీవితం సంఘర్షణమయం. తెల్లవారి పెత్తనాన్ని, నల్ల వారి దాష్టీకాన్ని ప్రతిఘటించాను. అందరూ కలిసి ఉంటూ..సమాన అవకాశాలు లభించాలన్నది నా లక్ష్యం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ నాకు అత్యంత ఇష్టమైనవని మండేలా ప్రకటించాడు.
అణగారిన ప్రజల తరపున పోరాడేందుకు సిద్దం..అవసరమైతే ఈ యజ్ఞంలో నేను ప్రాణాలు కోల్పోయినా ఆందోళన చెందను అని అన్నాడు మండేలా. అన్ని వైపులా ఒత్తిళ్లు రావడంతో విలియమ్ క్లర్క్ 1990 ఫిబ్రవరిలో విడుదల చేయాలని ఉత్తర్వులు ఇచ్చాడు. జైలు నుంచి వచ్చిన మండేలా జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. శాంతి నా ఆయుధం. శ్వేత జాతీయులతో ఒప్పందానికి సిద్దమని స్పష్టం చేశాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు నాయకత్వం వహించాడు. మండేలా రాసిన లాంగ్ వాక్ టు ఫ్రీడం ఎన్నదగిన పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. చివరి దశలో ఎన్నో వివాదాలు వెంటాడాయి. పెళ్లి విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ యావత్ ప్రపంచాన్ని ఇంతలా ప్రభావం చేసిన నాయకుడు 20వ వ శతాబ్దంలో లేరు. 2013లో నెల్సన్ మండేలా ఇక సెలవంటూ లోకాన్ని వీడారు.
Also Read : Opposition Meet : 26 పార్టీలతో మెగా కూటమి ఏర్పాటు