Shanthi Swaroop: తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత !

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత !

Shanthi Swaroop: తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (74) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరిన శాంతి స్వరూప్… చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన… చెరగని ముద్రవేశారు. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి శాంతి స్వరూప్ వార్తలు చదివేవారు. 1983 నవంబర్‌ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించిన ఆయన 2011లో పదవీ విరమణ చేసేవరకు దూరదర్శన్‌ లో పనిచేశారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. శాంతిస్వరూప్‌ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Shanthi Swaroop No More

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు దూరదర్శన్‌ లో వార్తలు అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఆయనేనని చెప్పారు. ‘‘నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి ప్రతి సోమవారం ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ కార్యక్రమం చేసేవాళ్లం. ఆరేళ్ల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందేవారు. ఆ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్‌(Shanthi Swaroop) ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని చంద్రబాబు ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు. శాంతి స్వరూప్‌ మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్తలు చదివే తొలితరం న్యూస్‌రీడర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారని.. మీడియా రంగంలో తనదైన ముద్రవేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గ్రాడ్యుయేషన్‌ చేసిన శాంతి స్వరూప్‌… 1978లోనే దూరదర్శన్‌లో చేరారు. అయితే యాంకరింగ్‌ చేసేందుకు ఆయన ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన దూరదర్శన్‌ తెలుగు తొలి బులిటెన్‌ వార్తల్ని చదివి వినిపించారాయన. టెలి ప్రాంప్టర్‌(ఎదురుగా స్క్రీన్‌ మీద చూసి..) లేని రోజుల్లో స్క్రిప్ట్‌ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరి తేరారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్‌పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు. దూరదర్శన్‌ లో 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్‌ను తమ గురువుగా భావిస్తుంటారు. అయితే 24/7 పేరిట న్యూస్‌ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పుల్ని ఆయన స్వాగతించలేకపోయారు. వార్తలు చదవకండి… వార్తలు చెప్పండి.. అని తర్వాతి తరం యాంకర్లకు సూచించారాయన.

శాంతి స్వరూప్‌(Shanthi Swaroop) సతీమణి రోజా రాణి కూడా న్యూస్‌ రీడర్‌. 1980లో వీళ్ల వివాహం జరగ్గా… వీళ్లకు ఇద్దరు సంతానం విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్‌… భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్‌ మీద మక్కువతో ‘క్రేజ్‌’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు.

Also Read : Raghu Rama Krishna Raju: టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు !

Leave A Reply

Your Email Id will not be published!