Nikhat Zareen : నిఖ‌త్ జ‌రీన్ ఛాంపియ‌న్

అనామిక‌ను ఓడించి స్వ‌ర్ణం కైవ‌సం

Nikhat Zareen : మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించింది తెలంగాణ‌కు చెందిన మ‌హిళా బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు ప‌త‌కాలు సాధించి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది.

తాజాగా మ‌రో ఘ‌న‌త‌ను స్వంతం చేసుకుంది. జాతీయ బాక్సింగ్ ఛాంపియ‌న్ షిప్ విజేత‌గా నిలిచింది. మ‌ధ్య ప్ర‌దేశ్ లోని భోపాల్ లో జ‌రుగుతున్న మ‌హిళా బాక్సింగ్ పోటీల్లో నిఖ‌త్ జ‌రీన్ స‌త్తా చాటింది.

సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో త‌న ప్ర‌త్య‌ర్థి అనామిక‌పై 4-1 తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. 50 కేజీల విభాగంలో ఈ ఇద్ద‌రు పోటీ ప‌డ్డారు. ఆట ఆరంభం నుంచే నిఖ‌త్ జ‌రీన్(Nikhat Zareen) పంచ్ ల‌తో విరుచుకు ప‌డింది. ప్ర‌త్య‌ర్థికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో ఏ ద‌శ‌లోనూ అనామిక నిఖ‌త్ జ‌రీన్ కు పోటీ ఇవ్వ‌లేక చ‌తికిల ప‌డింది.

ఈ పోటీ ఐదు రౌండ్ల పాటు కొన‌సాగింది. చివ‌ర‌గా ప్ర‌త్య‌ర్థి కంటే అత్య‌ధిక పాయింట్లు త‌న ఖాతాలో ప‌డేలా ప్ర‌ద‌ర్శ‌న చేసింది నిఖ‌త్ జ‌రీన్. ఈ ఏడాది చివ‌ర‌లో త‌న కెరీర్ లో మ‌రో బంగారు ప‌త‌కాన్ని న‌మోదు చేసింది. ఈ మొత్తం టోర్నీలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అద్భుత‌మైన ప్ర‌తిభ‌తో రాణించింది.

అంత‌కు ముందు నిఖ‌త్ జ‌రీన్ శివింద‌ర్ కౌర్ పై 5-0 తేడాతో ఓడించి విస్తు పోయేలా చేసింది. ఇక ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతుంద‌ని అంతా భావించారు. కానీ బ‌రిలోకి దిగే స‌రికి నిఖ‌త్ జ‌రీన్ పంచ్ ల‌కు అనామిక త‌ల వంచ‌క త‌ప్ప‌లేదు. మొత్తంగా స్వ‌ర్ణాన్ని సాధించి మున్ముందు తాను ఏ పోటీకైనా సిద్ద‌మేన‌ని ప్ర‌క‌టించింది నిఖ‌త్ జ‌రీన్.

Also Read : ప‌టిష్ట స్థితిలో టీమిండియా

Leave A Reply

Your Email Id will not be published!