ఐపీఎల్ లో నిలబడాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కేను తక్కువ స్కోర్ కే పరిమితం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 144 రన్స్ మాత్రమే చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ చాలా జాగ్రత్తగా ఆడింది. ఓ వైపు 4 వికెట్లు కోల్పోయినా విజయాన్ని అందుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే చెన్నై తప్పనిసరిగా ఆఖరి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆర్సీబీ , లక్నో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి.
ఇక ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ సైతం ఇంకా ఆశలతో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నాలుగు వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ చివరి దాకా ఉన్నాడు. 57 విలువైన పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రాణాకు తోడు యూపీ కుర్రాడు రింకూ సింగ్ దుమ్ము రేపాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 54 పరుగులు చేశాడు.