NTR Comment : నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. నటుడిగా తనను తాను మల్చుకున్న వైనం స్పూర్తి దాయకం. రాజకీయ చరిత్రలో చెరపలేని అధ్యాయం ఎన్టీఆర్(NTR). ఈ మూడు అక్షరాలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. నిత్యం స్మరించుకునేలా చేశాయి. ఆయనలోని నటుడు ఇప్పటికీ మనల్ని మరిచి పోలేకుండా చేస్తుంది. అంతలా అల్లుకు పోయారు. ఎందరో దిగ్గజ నటులు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందారు. కేవలం అన్న గారూ అన్న పిలుపు అందుకున్న ఏకైక నటుడు ఆయనే. దిగ్గజ నటులు ఉన్నా కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఇప్పటికీ గుర్తుండి పోయేలా చేసుకున్నారు.
కఠోర శ్రమ, క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఎన్టీఆర్(NTR) ను మహనీయుడిని చేసింది. తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదాన్ని నలు దిశలా లోకమంతటా వ్యాపింప చేసేలా చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. మెప్పించారు. తన ప్రతిభతో అలరించారు. ఆహ్లాద పరిచారు. ఆకట్టుకునేలా చేశారు. పౌరాణిక చిత్రాలంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. దైవానికి సంబంధించి ఏ పాత్ర అయినా ఆయన అవలీలగా చేశారు. దానిలో లీనమై పోయే వారు. పాత్రకు వంద శాతం న్యాయ చేసిన ఘనత ఎన్టీఆర్ కే చెల్లుతుంది. అంతే కాదు జానపదమైనా, సాంఘిక చిత్రాలైనా అలవోకగా నటించి మెప్పించారు.
44 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్టీఆర్(NTR) ఒక లెజెండ్ గా నిలిచి పోయారు. 13 చారిత్రకాలు, 55 జానపదం, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించి పోయారు. 1981లో సర్దార్ పాపారాయుడు షూటింగ్ సమయంలో కీలక ప్రకటన చేశారు. సినిమా పరంగా తెలుగు వారు ఆదరించారు. ఇక ప్రజా సేవే మిగిలిందన్నారు ఎన్టీఆర్. అదే రాజకీయ రంగానికి పునాది. తెలుగుదేశం పార్టీని స్థాపించేలా చేసింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ప్రభంజనంలా వచ్చారు. పెను ఉప్పెనై ఎగసి పడ్డారు. కేవలం 8 నెలల్లో ఊరూరా పర్యటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చైతన్య రథం సృష్టించిన ప్రభంజనం గాలికి హస్తం కొట్టుకు పోయింది. ఎన్టీఆర్ పెను గాలికి మహా మహులు ఓడి పోయారు. భారీ మెజారిటీని సాధించి ఔరా అని పించేలా చేశారు. సీఎంగా కొలువు తీరిన ఎన్టీఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2 రూపాయలకు కిలో బియ్యం ఎందరో పేదల పాలిట వరంగా మారేలా చేసింది. ఎనిమిదేళ్ల పాటు పరిపాలించారు. దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ వెన్నుపోటుకు గురయ్యారు. నటుడిగా, నాయకుడిగా, లక్షలాది మంది ప్రజల ఆదరాభిమానాలు పొందిన నందమూరి తారక రామారావు జనవరి 18, 1996లో ఇక సెలవంటూ వెళ్లి పోయారు. ఒక శకం ముగిసింది..ఒక జ్ఞాపకం మిగిలింది. ఎన్టీఆర్ చరిత్ర ఉన్నంత వరకు ఉంటారు.
Also Read : Brahmotsavam
