Opposition Parties Comment : విపక్షాల కూటమి విజృంభిస్తుందా
బెంగళూరులో ఏం జరగబోతోంది
Opposition Parties Comment : మోదీని తట్టుకుని భారతీయ జనతా పార్టీని ఢీకొనే సత్తా కలిగిన ఏకైక పార్టీ టార్చ్ లైట్ వేసినా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఆక్టోపస్ లా విస్తరించింది కాషాయం. దాని అనుబంధ సంస్థలు ఇవాళ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవం, చరిత్ర కలిగిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ఒక రకంగా పడుతూ లేస్తోంది. ఆ పార్టీకి ఆక్సిజన్ లాగా ఉపయోగపడ్డారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా. ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటి దాకా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తూ వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలకమైన పాత్ర పోషించింది జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఈ మేరకు సక్సెస్ కూడా అయ్యారు. తలపండిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన భావ సారూప్యత కలిగిన పార్టీలు, నాయకులను ఒకే చోటుకు చేర్చడంలో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
ఇందుకు మెచ్చుకోకుండా ఉండలేం ఏఐసీసీ చీఫ్ ఖర్గేను. ఆయన కాంగ్రెస్(Congress) పార్టీకి చీఫ్ గా కొలువు తీరాక అందరినీ కలుపుకుని ఒకే వేదికపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేసేందుకు చాలా సార్లు ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 26 పార్టీలు ఒకే వేదికపైకి రావడం ఒకింత ఆనందం కలిగించినా మిగతా పార్టీలు(Opposition Parties) రాకుండా ఉండడం కూడా పరిశీలించాల్సి ఉంది. విపక్షాలలో అంతా తలపండిన మేధావులు ఉన్నారు. మరికొందరు కొన్ని రాష్ట్రాలకు సీఎంలుగా పని చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు మోదీ బాధితులుగా మారి పోయారు. ఎప్పుడైతే కూటమిగా సమావేశం అయ్యేందుకు అడుగులు వేశారో ఆనాటి నుంచి వరుసగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. కోలుకోలేని ఝలక్ ఇస్తూ వస్తున్నాయి. బీహార్ లోని సర్కార్ లో భాగస్వామిగా ఉన్న ఆర్ఎల్డీ చీఫ్ , మాజీ సీఎంలు లాలూ, రబ్రీదేవితో పాటు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై కూడా ఏకధాటిగా దాడులు కొనసాగించాయి.
మరో వైపు తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం మధ్య కొట్టుకునేంత స్థాయికి వెళ్లింది. ఆమ్ ఆద్మీ పార్టీ సారథ్యంలోని పంజాబ్ , ఢిల్లీ రాష్ట్రాలపై కూడా కేంద్రం ఫోకస్ పెట్టింది. ఆపై కేరళ , ఛత్తీస్ గఢ్ , జార్ఖండ్ రాష్ట్రాలపై కూడా దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉండగానే విపక్షాలన్నీ లేకుండా పోయే ప్రమాదం ఉందని గ్రహించాయి. చివరకు ఒకే తాటి పైకి వచ్చేలా ప్లాన్ చేశాయి. మూకుమ్మడిగా ఇప్పుడు ఒకే స్వరాన్ని వినిపిస్తున్నాయి. అదే పేట్రియాట్రిక్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది ఏమైనా ఆకాశమంత ఎత్తులో ఉన్న మోదీ, ఆయన పరివారాన్ని, పార్టీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు చంద్రయాన్ లు కావాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో ఒక్కటిగా బరిలోకి దిగుతారా లేక ఇలాగే సమావేశాలు, భేటీల పేరుతో కాలయాపన చేస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : Revanth Reddy Slams : కేటీఆర్ సవాల్ రేవంత్ ప్రతి సవాల్