P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం(P Chidambaram) నిప్పులు చెరిగారు. కర్ణాటకలో విద్వేష పూరిత రాజకీయాలు చేస్తోందంటూ బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేని ఫెస్టో పూర్తిగా లౌకిక వాదానికి భిన్నంగా ఉందన్నారు. పి. చిదంబరం మీడియాతో మాట్లాడారు. యుసిసి, ఎన్ఆర్సీని ప్రవేశ పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
తమిళనాడుతో సహా ఇతర రాష్ట్రాలలో యుసిసి, ఎన్ఆర్సీని ప్రవేశ పెట్టేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) , నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వాగ్ధానాలతో కూడిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను విడదీసేలా ఉందన్నారు. ఇలా ఎంత కాలం ప్రజల భావోద్వేగాలతో, కులం, మతం పేరుతో విడదీస్తారంటూ చిదంబరం ప్రశ్నించారు.
యుసిసీ, ఎన్ఆర్సీ అనేవి దక్షిణ భారత దేశంలోకి పాకుతున్న హానికరమైన ఎజెండాగా ఆయన అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ప్రవేశ పెట్టేందుకు చూస్తున్నారని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని కల్లోలం చేస్తుందని ఆవేదన చెందారు మాజీ కేంద్ర మంత్రి(P Chidambaram).
Also Read : అమిత్ షా కామెంట్స్ స్టాలిన్ సీరియస్