P Shiv Shankar : బాధ‌తుల‌ గొంతుక‌ శివ‌శంక‌ర్

బ‌హుజ‌నుల‌కు అండ దండ

P Shiv Shankar : రాష్ట్ర రాజ‌కీయాల‌లో చెర‌గ‌ని ముద్ర పి. శివ‌శంక‌ర్(P Shiv Shankar) . బ‌హుజ‌నుల‌కు, బాధితుల‌కు గొంతుక‌గా ఉన్నారు. ఆయ‌న లోకాన్ని వీడి ఐదేళ్ల‌వుతోంది.

ఆయ‌న స్వంతూరు రంగారెడ్డి జిల్లా మామిడిప‌ల్లి. ఆయ‌న కొడుకు విన‌య్ కుమార్ పేరొందిన వైద్యులు. ఆగ‌స్టు 10, 1929లో పుట్టిన శివ‌శంక‌ర్ ఫిబ్ర‌వ‌రి 27, 2017లో క‌న్నుమూశారు. జీవిత కాలమంతా పేద‌లు, బడుగులు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించారు. పార్ల‌మెంట్ స‌భ్యుడిగా , కేంద్రంలో మాజీ మంత్రిగా ప‌ని చేశారు. 

అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన పి. శివ‌శంక‌ర్ మంత్రిగా ఎన్నో మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న ఏ ప‌ని చేసినా అది ప్ర‌జ‌ల సంక్షేమానికి సంబంధించి ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చారు.

1978, 1980, 1985 ల‌లో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున లోక్ స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. అమృత్ స‌ర్ నుంచి బీఏ చ‌దివిన పి. శివ శంక‌ర్ ఉస్మానియా యూనివ‌ర్శిటీ నుంచి న్యాయ శాస్త్రంలో ప‌ట్టాను పొందారు.

1974-1975 కాలంలో హైకోర్టులో న్యాయ‌వాదిగా కూడా ప‌ని చేశారు. కోడ‌లు అలేఖ్య పుంజాల కూచిపూడి నాట్య క‌ళాకారిణిగా గుర్తింపు పొందారు. 

ఆనాటి ఇందిరా గాంధీ ప్ర‌భుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 1985 , 1993 సంవ‌త్స‌రాల‌లో గుజ‌రాత్ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. రెండోసారి విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌, మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రిగా ప‌ని చేశారు పి. శివ శంక‌ర్. 

1987 -1988 లో ప్లానింగ్ క‌మిష‌న్ చైర్మ‌న్ గా ఉన్నారు. త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచారు. 1994-1995లో సిక్కిం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా , 1995-1996 వ‌ర‌కు కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు. 1998లో తెనాలి లోక్ స‌భ స్థానం నుంచి ఓడి పోయారు.

2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. 2008లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్ర‌జారాజ్యంలో చేరారు. కొంత‌కాలం పాటు ఉన్నారు. కోట్లాది మంది బ‌ల‌హీనుల జీవితాల‌కు మేలు చేర్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కింది. 

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండాల‌ని పోరాడారు. 1971లో సుప్రీంకోర్టులో గెలిచారు. అనుకూల‌మైన తీర్పు వ‌చ్చేలా చేశారు. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్స్ అమ‌లులోకి తీసుకు రావ‌డంలో ఆయ‌న చేసిన కృషి ప్ర‌శంస‌నీయం. 

అంతే కాకుండా ప్ర‌ధాన న్యాయ‌మూర్తులకు సంబంధించి బ‌దిలీ చ‌ట్టాన్ని తీసుకు రావ‌డంలో పి. శివ శంక‌ర్ పాత్ర గొప్ప‌ది. న్యాయ వ్య‌వ‌స్థ‌లో కుల ఆధిప‌త్యాన్ని తొల‌గించారు. అన్ని కులాల‌కు చెందిన న్యాయ‌వాదుల‌కు న్యాయ‌మూర్తులు కావ‌డానికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించేలా చేశారు. 

1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టులో 1980 దాకా ఒక్క బీసీకి చెందిన న్యాయ‌మూర్తి లేక పోవ‌డాన్ని గుర్తించారు శివ‌శంక‌ర్(P Shiv Shankar) . ఆయ‌న కేంద్ర మంత్రిగా కొలువు తీరాక వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తికి చెందిన వ్య‌క్తికి జ‌డ్జీగా ఛాన్స్ ద‌క్కింది. 

1980 నుంచి 1989 వ‌ర‌కు న‌లుగురు ఎస్సీల‌ను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు జ‌డ్జీలుగా ప్ర‌మోట్ చేశారు. జ‌స్టిస్ కేజీ బాలకృష్ణన్ తన‌కు అవ‌కాశం రావ‌డానికి కార‌ణం శివ శంక‌రేన‌ని బ‌హిరంగంగా పేర్కొన్నారు. జ‌స్టిస్ రామ స్వామి, బొజ్జ తార‌కం కూడా ఆయ‌న త‌మ‌కు చేసిన సాయం ప‌ట్ల గుర్తు చేసుకున్నారు. 

అంతే కాకుండా పి. శివ శంక‌ర్ చేసిన మ‌రో మంచి ప‌ని ఏమిటంటే పేద‌ల‌కు ఉచితంగా న్యాయ స‌హాయం పొంద‌డం ( సెంట్ర‌ల్ లీగ‌ల్ స‌ర్వీసెస్ యాక్ట్ 1987) పార్ల‌మెంట్ లో ఆమోదింప చేయ‌డం. 

మండ‌ల్ క‌మిష‌న్ సిఫార్సుల‌ను అమ‌లు చేయాల‌ని ఆనాటి పీఎం వీపీ సింగ్ కు స‌ల‌హా కూడా ఇచ్చారు. భార‌త జాతీయ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల క‌మిష‌న్ ను రూపొందించ‌డంలో పి. శివ శంక‌ర్(P Shiv Shankar)  ప్ర‌ధాన పాత్ర పోషించారు. 

ఆయ‌న త‌న జీవిత కాలంలో బ‌డుగుల కోసం, పేద‌ల బాగు కోసం ప‌రిత‌పించారు. త్వ‌ర‌లో పి. శివ శంక‌ర్ ఆత్మ క‌థ కూడా రాబోతోంది.

ఆయ‌న‌కు నివాళిగా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఒక జిల్లాకు లేదా యూనివ‌ర్శిటీకి పేరు పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్న డాక్ట‌ర్ విన‌య్ కుమార్ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

Also Read : హిందూ మ‌తం గొప్ప‌ది – జ‌స్టిస్ జోసెఫ్

Leave A Reply

Your Email Id will not be published!