Pada Yatra Comment : రాజకీయం ‘పాదయాత్ర’ల కాలం
ఊపందుకున్న ఎన్నికల వేడి
Pada Yatra Comment : పవర్ లోకి రావాలంటే ఏం చేయాలి. ప్రజల్లోకి వెళ్లాలి. టెక్నాలజీ ఎంత మారినా, ఎన్ని వ్యూహాలు పన్నినా ఓట్లు ముఖ్యం. అధికారంలోకి రావాలంటే మిగిలింది ఒక్కటే. జనం గతంలో లాగా లేరు. చెబితే వినే స్థాయిని దాటేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాజకీయం కొత్త రూపు సంతరించుకుంది.
నయా జమానా ఊరేగుతున్న తరుణంలో పాదయాత్ర అన్నది కీలకంగా మారింది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో శాసనసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాయి.
ప్రతి ఒక్కరు పాదయాత్రను నమ్ముకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఏకంగా 3,678 కిలోమీటర్ల భారీ పాదయాత్రకు(Pada Yatra) శ్రీకారం చుట్టారు. దీనికి భారత్ జోడో యాత్ర అని పేరు పెట్టారు. దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలనే నినాదంతో ముందుకు కదిలారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తయింది. తర్వాత మధ్య ప్రదేశ్ లో కొనసాగనుంది. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.
చిన్నారుల నుంచి వృద్దుల దాకా అన్ని కులాలు, మతాల వారి నుంచి ఊహించని దాని కంటే స్పందన లభించడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. ఇదే సమయంలో గతంలో ఏపీలో పవర్ లోకి వచ్చేందుకు వైఎస్సార్ సీపీ చీఫ్ సందింటి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు.
టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఏపీలో సీఎంగా కొలువుతీరారు. ఇదే సమయంలో పవర్ కోల్పోయిన చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరో వైపు ఆయన సోదరి వైసీపీ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర చేపట్టారు.
ఇప్పటికే ఆమె తెలంగాణలో కొనసాగిస్తోంది యాత్ర. ఇంకో వైపు బీహార్ లో ప్రజల కోసం జన్ పరివర్తన్ యాత్ర చేపట్టారు భారతీయ రాజకీయ వ్యూహకర్త గా పేరొందిన ప్రశాంత్ కిషోర్. ఆయన ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు. రాష్ట్రంలో కొలువు తీరిన జేడీయూ సంకీర్ణ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు.
10 లక్షల జాబ్స్ ఎందుకు భర్తీ చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా రాబోయే కాలంలో మరిన్ని పాదయాత్రలు కొనసాగే అవకాశం ఉంది.
ఒక రకంగా చెప్పాలంటే పాదయాత్రలు పవర్ లోకి తీసుకు వస్తాయో రావో తెలియదు కానీ వాటి ప్రాధాన్యత మాత్రం ముఖ్యమని ఆయా పార్టీలకు, నేతలకు తెలిసి పోయింది. మొత్తంగా ప్రజలకు పాదయాత్రల ద్వారా కొంత మేర ఉపశమనం కలుగుతుందన్నది మాత్రం వాస్తవం.
Also Read : ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్