Padma Shri Baba Sivananda: ప్రముఖ యోగా గురువు బాబా శివానంద్ కన్నుమూత ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ యోగా గురువు బాబా శివానంద్ కన్నుమూత ప్రధాని మోదీ సంతాపం

 

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ శనివారం రాత్రి ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. బాబా శివానంద్ (128) కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఏప్రిల్ 30న బీహెచ్‌యూ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన నివాసంలో అంత్యక్రియల కోసం ఉంచారు. ఆయన శిష్యుల అభిప్రాయం ప్రకారం కబీర్ నగర్ లోనే అంత్యక్రియలు జరగనున్నాయి. శివానంద్ బాబా మృతి పట్ల ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ సంతాపం తెలిపారు.

ప్రధాని మోదీ సంతాపం

యోగా సాధకుడు, కాశీ నివాసి శివానంద్ బాబా జీ మరణం చాలా బాధాకరం. యోగా సాధనకు అంకితమైన ఆయన జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. యోగా ద్వారా సమాజానికి సేవ చేసినందుకు ఆయనకు పద్మశ్రీ కూడా లభించింది. శివానంద్ బాబా నిష్క్రమణ కాశీ నివాసితులందరికీ ఆయన నుంచి ప్రేరణ పొందిన కోట్లాది మందికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో నేను ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు.

శివానంద్ బాబాను పద్మశ్రీతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం

 

శివానంద్ బాబా వారణాసిలోని భేలుపూర్ ప్రాంతంలోని దుర్గాకుండ్‌ లో ఉన్న కబీర్ నగర్‌లో నివసించారు. ఆయన ప్రతిరోజూ కూడా క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేవారు. ఆయన జీవితం బ్రహ్మచర్యానికి అనేక మందికి ఉదాహరణగా నిలిచింది. 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శివానంద్ బాబాను పద్మశ్రీతో సత్కరించారు. ఆ గౌరవాన్ని అందుకోవడానికి, ఆయన చెప్పులు లేకుండా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన మోకాళ్లపై కూర్చుని ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ కూడా ఆయనను గౌరవించడానికి తన కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. అప్పటి రాష్ట్రపతి కోవింద్ కూడా వంగి బాబాను గౌరవంగా పైకి లేపారు. శివానంద్ బాబా యోగాభ్యాసం ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

శివానంద్ బాబా జీవిత గమ్యం

 

శివానంద్ బాబా 1896 ఆగస్టు 8న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని శ్రీహట్టి (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది)లో ఒక పేద బ్రాహ్మణ భిక్షాటన కుటుంబంలో జన్మించారు. ఆయన నాలుగు సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులు అతన్ని నవద్వీప్ నివాసి బాబా ఓంకారానంద్ గోస్వామికి అప్పగించారు. అతనికి ఆరు సంవత్సరాల వయసులో, అతని తల్లిదండ్రులు, సోదరి ఆకలితో చనిపోయారు. ఆ తరువాత, అతను తన జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు. ఆ క్రమంలో తన జీవితాన్ని యోగా, తపస్సు, సేవకు అంకితం చేశారు. యోగాతో పాటు శివానంద్ బాబాకు ప్రజాస్వామ్యంపై కూడా అచంచలమైన నమ్మకం ఉంది. ఆయన ప్రతి ఎన్నికల్లో కూడా వారణాసికి వెళ్లి ఓటు వేసేవారు. ఆయన మరణం యోగా, భారతీయ సంప్రదాయంలోని ఒక ప్రత్యేకమైన యుగానికి ముగింపు పలికిందని చెప్పవచ్చు.

Leave A Reply

Your Email Id will not be published!