Assam CM : బాల్య వివాహాలు చేస్తే అరెస్ట్ – సీఎం
హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ
Assam CM : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాలకు పాల్పడితే లేదా ప్రోత్సహించినా వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. 14 ఏళ్ల లోపు బాలికలను ఎవరైనా వివాహం చేసుకున్నా లేదా లైంగికంగా వేధింపులకు పాల్పడినా లేదా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.
బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు హిమంత బిస్వ శర్మ(Assam CM). ఈ విషయంలో ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. బాల్య వివాహాలకు పాల్పడే వారిని శుక్రవారం నుంచి అరెస్ట్ చేస్తామని చెప్పారు. గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. రానున్న ఆరు లేదా ఏడు రోజుల్లో 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్న వేలాది మంది యువకులు లేదా పురుషులను అరెస్ట్ చేస్తామని చెప్పారు హిమంత బిశ్వా శర్మ.
అస్సాం సీఎం నాగోన్ మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులతో జరిగిన సంభాషణలో ఈ విషయాన్ని ప్రకటించారు. బాల్య వివాహాలు లేకుండా చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,004 కేసులను నమోదు చేసిందని చెప్పారు హిమంత బిశ్వ శర్మ. ఫిబ్రవరి 3 నుండి కేసులు ప్రారంభిస్తామన్నారు సీఎం.
రాష్ట్రంలోని ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు హిమంత శర్మ(Assam CM). ఇప్పటి వరకు ధుబ్రి జిల్లాలో అత్యధిక బాల్య వివాహాలు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 370 జరిగినట్లు తెలిపారు.
Also Read : అదానీ రుణాలపై ఆర్బీఐ ఆరా