PM Modi : ఆలయాల విధ్వంసంపై మోదీ ఆరా
ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ తో ప్రస్తావన
PM Modi Hindu Temples : భారత దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన దేశంలో జరుగుతున్న జి20 గ్రూప్ సమావేశానికి విచ్చేశారు.
అంతకు ముందు గురువారం గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్బంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఆస్ట్రేలియా, భారత దేశాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ను పీఎంతో కలిసి వీక్షించారు. శుక్రవారం ఇరు దేశాలకు చెందిన ప్రధానులు ఇద్దరు మోదీ , ఆంథోనీ కీలక చర్చలు జరిపారు.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Hindu Temples) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో ప్రార్థనా స్థలాలకు, దేవాలయాలకు, హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలని కోరారు. అక్కడ కొలువు తీరిన ఆలయాలకు పూర్తి భద్రత కల్పించాలని సూచించారు నరేంద్ర మోదీ పీఎం ఆంథోనీ ఆల్బనీస్ కు.
ఆలయ విధ్వంసానికి సంబంధించిన నివేదికలను ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ ఆల్బనీస్ మాట్లాడారు. దేశంలో నెలకొన్న ఆలయాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు. భారతీయ సమాజానికి భద్రత కల్పిస్తామని ఇది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ మేరకు స్పష్టమైన హామీ ఇస్తున్నానని తెలిపారు ఆంథోనీ ఆల్బనీస్.
గత వారం బ్రిస్బేన్ లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీలక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు దాడి చేశారు. ఇది నాలుగో ఘటన కావడం విశేషం.
Also Read : భారత్ పై దుష్ప్రచారం ఒప్పుకోం – ఠాకూర్