TDP BJP JSP Meeting: ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ ?

ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ ?

TDP BJP JSP Meeting: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ(TDP), జనసేనను ఎన్డీఏలోనికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని… సీట్ల కేటాయింపు తదితర విషయాలను అతి త్వరలో వెల్లడిస్తామంటూ… బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 17న టీడీపీ-జనసేన(Janasena) తమ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించడం ద్వారా ఎన్నికలకు సమర శంఖం పూరించడానికి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం టీడీపీ, జనసేన నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి వెంకటేశ్‌, చదలవాడ అరవిందబాబు, జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, రాజా రమేశ్‌ పరిశీలించారు.

TDP BJP JSP Meeting – ఈ నెల 17న చిలకలూరిపేట వేదికగా మోదీ, చంద్రబాబు, పవన్ ల బహిరంగ సభ ?

చిలకలూరిపేట బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు, భవిష్యత్‌ కార్యాచరణను చంద్రబాబు, పవన్ ప్రకటించనున్నారు. అయితే టీడీపీ, జనసేనలు ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయే తొలి బహిరంగ సభ కావడంతో… ఈ సభకు దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బహిరంగసభకు ప్రధాని మోదీ కూడా హాజరవుతారనే సమాచారం ఉందన్నారు. ‘‘చిలకలూరిపేట సభ ద్వారా దేశానికి ఒక సందేశం ఇస్తాం. చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ వెళ్లిన దగ్గర్నుంచి జగన్‌, వైసీపీలో కలవరం మొదలైంది. మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలనే దుర్బుద్ధితో వైసీపీ ప్రచారం చేస్తోంది. సీఎం జగన్‌ ఏపీని సర్వనాశనం చేశారనే సమాచారం ఢిల్లీ పెద్దలకు ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే సభ చరిత్రలో నిలిచిపోతుంది’’ అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

Also Read : Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు !

Leave A Reply

Your Email Id will not be published!