Political Criminals Comment : పొలిటికల్ అనకొండల్ని ఆపలేమా
న్యాయ వ్యవస్థకు చేత కాదా
Political Criminals Comment : ప్రజాస్వామ్యం అత్యున్నతమైనది. దీనిని నిరంతరం పరీక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్న ఏకైక సాధనం భారత రాజ్యాంగం. దీనిలో ఉన్న లొసుగులను, చట్టాలను ఆసరాగా చేసుకుని అనకొండలుగా తయారవుతున్నారు దేశంలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై చట్ట సభల్లోకి వచ్చాక తమకు తోచిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలకమైన పాత్ర పోషిస్తూ కీలకమైన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రత్యేకించి లెక్కకు మించిన ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ ఆస్తులను పెంచుకుంటూ పోతున్నారు. వీటిపై నియంత్రణ లేకుండా పోయింది. ఇక్కడ దాచుకున్నది కాకుండా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేసి దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. పేరుకు ప్రజాస్వామ్యం అన్నదే కానీ మొత్తంగా ఏకస్వామ్య వ్యవస్థగా మారి పోయింది. బాబా సాహెబ్(Baba Saheb) కష్టపడి తయారు చేసిన చట్టాలు, రూపొందించిన అంశాలు నీటి మీద రాతలుగా మారి పోయాయి. దేశానికి చిహ్నంగా ఉండే పార్లమెంట్ సాక్షిగా డబ్బులు పంచుతూ దొరికి పోయారు. ఇది సమున్నత భారతావనిని తల వంచుకునేలా చేసింది. ప్రధానంగా రాజకీయాలలో రాను రాను నేరస్థుల సంఖ్య పెరుగుతోంది. హత్యా రాజకీయాలకు పాల్పడిన వారి తో పాటు ఆర్థిక నేరగాళ్లు పెరిగి పోయారు.
ఇది దేశాన్ని ప్రధానంగా కలవర పెడుతున్న సమస్య. దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా 75 ఏళ్లలో లెక్కలేనన్ని కేసులు, లెక్కించలేనంత ధనం పట్టుబడింది. కొందరు సీఎంలు ఏకంగా జైలు పాలయ్యారు. మరికొందరు ఇంకా బతికే ఉన్నారు. న్యాయ వ్యవస్థలో చోటు చేసుకున్న లొసుగులే వీరిని ప్రధానంగా రక్షిస్తున్నాయనే అపవాదు లేక పోలేదు. రాజకీయాల్లో అనకొండలు, నేరస్థులను నియంత్రించాల్సిన అధికారం ఎవరికి ఉందనే ప్రశ్న ఉదయించక మానదు. దీనిపై గత కొన్నేళ్లుగా చర్చకు వస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది ఒకానొక సందర్భంలో కేసు విచారణ సందర్భంగా. రాజకీయాల్లో నేరస్థులను నిషేధించ లేమని , దానిని పార్లమెంట్ కే వదిలి వేస్తున్నామని స్పష్టం చేసింది. ఏ చట్టాలను రూపొందిస్తున్నారో వారే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని ఆది లోనే పోటీలో దిగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది మోదీ సర్కార్ కు. సీఈసీ పీఎంను, రాష్ట్రపతిని నిలదీసేలా ఉండాలని కానీ జీ హుజూర్ అనేలా ఉండకూడదని చెంప ఛెల్లుమనించింది.
సర్కార్ కు బుద్ది రాలేదు. విచిత్రం ఏమిటంటే ఎలక్టోరల్ బాండ్ల స్కీంను తీసుకు వచ్చింది. భారీ ఎత్తున బీజేపీకి వేల కోట్లు సమకూరాయి. బ్లాక్ మనీని వైట్ మనీ స్కీంగా మార్చుకునేలా చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇంతకు చట్టాలు ఏం చెబుతున్నాయి. పొలిటికల్ లీడర్లు నేరం చేసినట్లు రుజువైతే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు. కాగా క్రిమినల్ కేసులున్న రాజకీయ నాయకులను పోటీ చేయకుండా నిషేధించేందుకు కోర్టు నిరాకరించింది. కాగా నేర స్వభావం ఉన్న వారు పాలిటిక్స్ లోకి రాకుండా ఉండేలా పార్లమెంట్ చట్టాలను తయారు చేయాల్సిన అవసరం ఉందని తీర్పు చెప్పింది. క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లను ఎన్నుకునేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ పై , ప్రజలపై ఉందని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే దేశంలోని ప్రజా ప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలలో దాదాపు సగానికి పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. – రాజకీయాలు దాదాపు కలుషితంగా మారాయి. ఇది ప్రజాస్వామ్యానికి హెచ్చరిక. రాజ్యాంగ నైతికతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. డెమోక్రసీ మూలాలు దెబ్బతింటాయి. దీని వల్ల అరాచకత్వం , నియంతృత్వానికి దారి తీస్తుంది. పౌరులకు ఆశనిపాతంగా మారుతుందని సుప్రీంకోర్టు(Supreme Court) హెచ్చరించింది.
Also Read : Pawan Khera : ఎలక్టోరల్ బాండ్ స్కీం బక్వాస్