Pragya Thakur Comment : ‘ప్రగ్యా’ కలకలం ‘కత్తుల’ కోలాటం
ముదిరిన లవ్ జిహాద్ వివాదం
Pragya Thakur Comment : లవ్ జిహాద్ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు. శద్దా వాకర్ ను దారుణంగా హత్య చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోసారి హిందూ, ముస్లిం వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుంది.
దీని వెనుక కో ఆర్టిస్ట్ షీజాన్ ఖాన్ ఉన్నాడని మృతురాలి తల్లి ఆరోపించింది. ఆ తర్వాత ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది.
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్ కదమ్ తో పాటు మంత్రి గిరీశ్ మహాజన్ తునీషా శర్మ చని పోవడానికి లవ్ జిహాద్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిని పోలీసులు తోసి పుచ్చారు.
ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని, 15 రోజుల కిందటే బ్రేకప్ చెప్పాడని దీంతో తట్టుకోలేక తునీషా శర్మ సూసైడ్ చేసుకుందని పేర్కొన్నారు.
ఇదంతా పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలో అత్యంత వివాదాస్పద నాయకురాలిగా పేరొందారు ప్రగ్యా సింగ్ ఠాకూర్.ఆమె మరోసారి సంచలనంగా మారారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ దేశంలో లవ్ జిహాద్ పేరుతో మరో ఉగ్రవాదం మొదలైందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క హిందూ కుటుంబం సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అంతే కాదు బాలికలు, యువతులు, మహిళలపై రాబోయే రోజుల్లో దాడులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే ఆత్మ రక్షణ కోసం,
తమను తాము కాపాడుకునేందు కోసం అవసరమైతే ఆయుధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఒక వేళ వెపన్స్ కొనుగోలు చేసే శక్తి లేక పోతే ఇంట్లో కూరగాయలు లేదా ఇతర వాటి కోసం ఉపయోగించే కత్తులకు వెంటనే పదును పెట్టాలని స్పష్టం చేశారు ప్రగ్యా ఠాకూర్(Pragya Thakur). దీని వల్ల తమను తాము దాడుల నుంచి కాపాడు కునేందుకు వీలు కుదురుతుందన్నారు ఎంపీ.
లవ్ జిహాద్ పై ఇప్పటికే కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ తరుణంలో తాజాగా ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆమె కామెంట్స్
ఉన్నాయంటూ దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ భారత్ జోడో యాత్ర చేపట్టారు. తొమ్మిది రాష్ట్రాలలో యాత్ర పూర్తి చేసుకుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్స్ పై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు మద్దతు తెలిపింది. ఆమె చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంది.
ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు ఉంచు కోవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. ఇదే సమయంలో క్రిష్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న సంస్థల్లో పిల్లలకు విద్యను అందించడాన్ని తప్పు పట్టింది ప్రగ్యా సింగ్ ఠాకూర్(Pragya Thakur).
ఇదిలా ఉండగా మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఎంపీ 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్నారు. శివ మొగ్గలో జరిగిన
హిందూ జాగరణ వేదిక సదస్సులో ఈ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
వారికి లవ్ జిహాద్ ఉన్నప్పుడు తమకు కత్తులు, ఆయుధాలు ఎందుకు ఉండ కూడదని ప్రశ్నిస్తున్నారు ప్రగ్యా సింగ్ ఠాకూర్.
ఏది ఏమైనా విద్వేషాల పునాదుల మీద సమున్నత భారతం నడవాలని అనుకోవడం దేశానికి, సమాజానికి మంచిది కాదని రాజకీయ నిపుణులు
పేర్కొంటున్నారు. నేరం ఎవరు చేసినా తప్పే. దానికి కోర్టులు ఉన్నాయి. చట్టం ఉంది.
ప్రజాస్వామ్యంలో శిక్ష పడేందుకు ఆస్కారం ఉంది. బాధ్యత కలిగిన నాయకులు మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలి.
ఇప్పటికే నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇకనైనా ఆలోచించాలి. శాంతి తప్ప మరో మార్గం లేదన్నది గమనించాలి.
Also Read : ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ల ధరలు ప్రియం