Rahul Gandhi Comment : రాహుల్ కు రక్షణ కవచమేది
అగ్ర నేతపై ముప్పేట దాడి
Rahul Gandhi Comment : దేశ వ్యాప్తంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చర్చనీయాంశంగా మారారు. ఆయన తన స్వరాన్ని పెంచుతూ వచ్చారు. ఇదే సమయంలో పార్టీలో పాత తరం నాయకులను పట్టించు కోలేదన్న అపవాదు ఎదుర్కొన్నారు.
ఇదే సమయంలో దిగ్గజ నాయకులుగా పేరొందిన వారంతా గుడ్ బై చెప్పారు. ఇంటా బయటా తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందుకు హాజరయ్యారు తన తల్లితో కలిసి. పార్లమెంట్ సాక్షిగా తన వాయిస్ ను ప్రజల పక్షాన వినిపించారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని(PM Modi) టార్గెట్ చేశారు.
వ్యక్తిగత విమర్శలకు దిగారు. కానీ పార్టీ క్యాడర్ లో మరింత భరోసాను నింప లేక పోయారన్న విమర్శలు లేక పోలేదు. కాంగ్రెస్ పార్టీ కాదని అది కేవలం కుటుంబ పార్టీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ. మోదీ సారథ్యంలో , ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా రథసారథిగా ముందుకు దూసుకు వెళుతోంది.
మరో వైపు సోషల్ మీడియాలో ముందంజలో ఉంది. కానీ బీజేపీని ధీటుగా ఎదుర్కోవడంలో ఇంకా కాంగ్రెస్ మీన వేషాలు లెక్కిస్తోంది.
ఇదే సమయంలో 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో పదవులు చేపట్టిన మాజీ కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ సంచలన ఆరోపణలు చేశారు. దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన దాంట్లో కనీసం 20 శాతం చేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంతలా దిగజారి ఉండేది కాదని పేర్కొన్నారు.
వ్యక్తిగత విమర్శల వల్ల పార్టీకి నష్టం తప్ప మేలు చేకూరదని స్పష్టం చేశారు. మోదీ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ స్టాండ్ సరిగా లేదంటూ మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తనయుడు , కేరళ సోషల్ మీడియా ఇంఛార్జ్ అనిల్ కే ఆంటోనీ గుడ్ బై చెప్పాడు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాను రాను పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు వాపోతున్నారు. దేశ వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ సరైన దిశలో నడిపించ లేక పోవడం ప్రధాన అవరోధంగా మారిందన్న విమర్శలు లేక పోలేదు.
ఆజాద్ అన్నట్టు మల్లికార్జున్ ఖర్గే పార్టీకి చీఫ్ అయినా నడిపేదంతా రాహుల్ గాంధీనేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. మోదీపై చేసిన వ్యక్తిగత కామెంట్స్ , పరువు నష్టం కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాని నుంచి కోలుకునే లోపే లోక్ సభ ఎంపీగా అనర్హత వేటు పడింది.
ఇదే క్రమంలో తాను సత్యాన్ని నమ్ముతానని ధర్మం గెలుస్తుందని ప్రకటించారు రాహుల్ గాంధీ. మొత్తంగా రాహుల్ గాంధీని(Rahul Gandhi Comment) రక్షించింది మాత్రం తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర. అదానీపై పదే పదే విమర్శలు చేస్తున్న యువ నేతపై విమర్శలు గుప్పించారు నిర్మలా సీతారామన్. కేరళలో కాంగ్రెస్ హయాంలోనే అదానీకి ఓడరేవు కట్టబెట్టారని, మొన్నటికి మొన్న రాజస్తాన్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోలేదా అని ప్రశ్నించారు.
ఏది ఏమైనా రాజకీయాలు చేయాలన్నా లేదా రాణించాలన్నా ఎత్తులకు పై ఎత్తులు వేయాలి..చదరంగాన్ని అవపోసన పట్టాలి. ఆధునిక పోకడలు, అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవాలి. అన్నింటికి మించి భరోసా కల్పించేలా నిత్యం ప్రజల్లో ఉండాలి. మరి రాహుల్ గాంధీకి రక్షణ కవచం ఏది అన్న ప్రశ్న ఉదయించక మానదు.
Also Read : బండి పిటిషన్ పై హైకోర్టు కామెంట్స్