Rahul Gandhi Comment : తెగిన బంధం రాహుల్ భావోద్వేగం

19 ఏళ్ల నివాసానికి గుడ్ బై చెప్పిన నేత

Rahul Gandhi Comment : కొన్నింటి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కొందరికి కొన్నింటితో అనుబంధం ఉంటుంది. అన్నింటికంటే ఎక్కువ జ్ఞాప‌కాలు ఉంటాయి. వాటిని ఉన్న‌ప‌ళంగా వ‌దిలేసు కోవాలంటే త‌ట్టుకోలేరు. ఇటీవ‌ల బంధాల గురించి, మాన‌వ సంబంధాల గురించి గొప్ప‌గా తెర‌పై చిత్రీక‌రించిన సినిమా వేణు తీసిన బ‌లగం సినిమా లోనిది.

దీనిని ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌స్తోందంటే ఇవాళ భార‌త దేశంలో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ చీఫ్ , మాజీ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఢిల్లీలో కొన్నేళ్ల పాటు ఉన్న త‌న ఇంటిని (బంగ్లా) ఖాళీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ల్లి సోనియా గాంధీ ఎంపీగా ఉన్నారు. వాళ్లు కోరుకుంటే ఏ బంగ్లా లోనైనా ఉండ‌వ‌చ్చు. కానీ చివ‌రి దాకా తాను నిజ‌మే మాట్లాడతాన‌ని, స‌త్యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త కొన్నేళ్ల నుంచి రాహుల్ గాంధీ హాట్ టాపిక్ గా మారారు భార‌త దేశంలో. ఆయ‌న ప్ర‌తిసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని, భార‌తీయ జ‌న‌తా పార్టీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను తూర్పార బ‌డుతూ వ‌చ్చారు. అంతే కాదు ఎంపీగా ప్ర‌తి నిమిషం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను, ప్ర‌ధానంగా కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను నిల‌దీస్తూ వ‌చ్చారు.

75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌త దేశంలో కాపాడుకుంటూ వ‌చ్చిన ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అప్ప‌నంగా అమ్ముకుంటూ పోతే ఈ దేశంలో ఉన్న ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌ధానంగా న‌రేంద్ర మోదీకి(PM Modi), గౌతం అదానీ, అనిల్ అంబానీల‌కు ఉన్న సంబంధాల గురించి ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తూ వ‌చ్చారు.

అంతే కాదు మోదీ చేస్తున్న ఆగ‌డాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు ఏకంగా 150 రోజుల‌కు పైగా భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. మ‌తం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌వ‌ద్దంటూ కోరారు. ప్ర‌జ‌లంతా క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

ఒక ర‌కంగా మ‌రో స్వాతంత్ర ఉద్య‌మాన్ని త‌ల‌పింప చేసింది ఈ యాత్ర‌. ఇదే స‌మ‌యంలో 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మోదీ పేరు క‌లిగిన వాళ్లంతా దేశం దాటి పోయారని, వారంతా ఆర్థిక నేరాల‌లో చిక్కుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు బీజేపీ ఆరోపించింది. దీనిపై సూర‌త్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం రాహుల్ గాంధీకి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

దీంతో ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఎంపీగా అన‌ర్హ‌త వేటు వేశారు స్పీక‌ర్. ఆ త‌ర్వాత లోక్ స‌భ క‌మిటీ వెంట‌నే రాహుల్ గాంధీ ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు తాను ఎక్క‌డా త‌గ్గేది లేదంటూ స్ప‌ష్టం చేశారు.

శ‌నివారం రాహుల్ గాంధీ(Rahul Gandhi Comment) త‌న సోద‌రితో క‌లిసి తాను 19 ఏళ్లుగా ఉంటున్న బంగ్లాను ఖాళీ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌తో పాటు ఉన్న వారికి, సేవ‌లు అందించిన వారికి పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఇవాళ ఎంపీగా నన్ను తొల‌గించ గ‌ల‌రు..బంగ్లా నుంచి ఖాళీ చేయించ గ‌ల‌రు..కానీ ప్ర‌జ‌ల నుంచి వేరు చేయ‌లేరంటూ స్ప‌ష్టం చేశారు. ఎంతైనా బంగ్లాతో ఉన్న బంధాన్ని ఆయ‌న తెంచు కోలేక పోయారు.

Also Read : డీకే శివ‌కుమార్ హెలికాప్ట‌ర్ త‌నిఖీ

Leave A Reply

Your Email Id will not be published!