Rahul Gandhi: ‘స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ పై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు !

‘స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’ పై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు !

Rahul Gandhi: ఎన్నికల ఫలితాల రోజు స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ నష్టాలను మూటగట్టుకుంది. దీనితో సుమారు రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు గాలిలో కలిసిపోయాయి. ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. దీన్ని ‘అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌’గా అభివర్ణించారు. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా పాత్ర ఉందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం డిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫేక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌తో జూన్‌ 3న స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని… ఎన్నికల ఫలితాల రోజు (జూన్‌ 4న) భారీగా నష్టపోయాయని రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అన్నారు. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు సుమారు రూ.30 లక్షల కోట్లు కోల్పోయారన్నారు. ఇదో పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్టాక్‌ మార్కెట్ల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. జూన్‌ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయంటూ అసలు మోదీ, అమిత్‌ షా మదుపర్లకు పెట్టుబడి సలహాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని వారికి ముందే తెలుసని వ్యాఖ్యానించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ముందురోజు భారీ స్థాయిలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ లావాదేవీల పట్టికను విలేకరుల సమావేశంలో రాహుల్‌ ప్రదర్శించారు. ఆ రోజు లావాదేవీల్లో పాల్గొన్నదెవరు? అంతిమంగా లబ్ధి పొందిందెవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని కొందరు విదేశీ మదుపరులు సద్వినియోగం చేసుకున్నారన్నారని వ్యాఖ్యానించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా… కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రం లాభపడ్డారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మోదీ, షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. వీరితో పాటు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు, విదేశీ వ్యక్తుల పాత్రనూ నిగ్గు తేల్చాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

Rahul Gandhi – ఓటమిని జీర్ణించుకోలేక రాహుల్ ఆరోపణలు – బీజేపీ

స్టాక్‌ మార్కెట్‌ గురించి రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ ఖండించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే రాహుల్‌ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలని ఓ వైపు మోదీ చూస్తుంటే.. మరోవైపు మదుపర్లను రాహుల్‌ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని దుయ్యబట్టారు.

Also Read : Kangana Ranaut: కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన CISF కానిస్టేబుల్‌ !

Leave A Reply

Your Email Id will not be published!