Rain Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు
బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు...
Rain Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని ఏపీ(AP) విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి, రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Rain Alert in AP..
అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదని హెచ్చరించారు. పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
కాగా ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి ఆదివారం మరింత విస్తరించింది. సోమవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ(AP) దక్షిణ కోస్తా తీరం వైపు పయనించే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సోమవారం నుంచి 17వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయ, అరుణాచల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు రోజుల్లో నైరుతి మరింత బలహీనపడుతుందని వివరించింది. ఇక దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read : Alai Balai : ఈ అలై బలై కార్యక్రమంతో గవర్నర్ దత్తాత్రేయ అందరిని ఒక తాటికి తీసుకువచ్చారు