Rakesh Tikait : విధ్వంస‌క‌ర విధానాలు ఒప్పుకోం

రైతు నేత రాకేశ్ తికాయ‌త్ ఫైర్

Rakesh Tikait : భార‌తీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్ర‌తినిధి, రైతు అగ్ర నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రైతులు, కార్మికులు, కూలీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వాలు ఏ నిర్ణ‌యం తీసుకున్నా తాము వ్య‌తిరేకిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

విధ్వంస‌క‌ర విధానాల‌ను తాము ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకోబోమని అన్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని జేవార్ లో మ‌హా పంచాయ‌త్ నిర్వహించారు.

ఈ స‌మావేశానికి భారీ ఎత్తున రైతులు, కార్మికులు, కూలీలు హాజ‌ర‌య్యారు. వారిని ఉద్దేశించి రాకేశ్ తికాయ‌త్ ప్ర‌సంగించారు. ఆయా ప్ర‌భుత్వాలు అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాలు, లేదా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని చెప్పారు.

అయితే ఇదే స‌మ‌యంలో అన్న‌దాత‌ల‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా లేదా తీసుకోవాల‌ని అనుకున్నా తాము ఒప్పుకోమ‌న్నారు. దేశ వ్యాప్తంగా మ‌రోసారి ఉద్య‌మించేందుకు సిద్దంగా ఉంటామ‌ని వెల్ల‌డించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌వసాయ రంగం ప‌ట్ల స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న లేక పోవ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి అన‌ర్థాలు చోటు చేసుకుంటున్నాయ‌ని చెప్పారు.

స‌మ‌గ్ర‌మైన విధానం తీసుకు వ‌స్తే బాగుంటుంద‌ని సూచించారు. రైతులు పండించిన పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని, వారికి సాగు భ‌ద్ర‌త ఇవ్వాల‌ని రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait) డిమాండ్ చేశారు.

ఒక‌వేళ విధ్వంస‌క‌ర విధానాలు తెర పైకి తీసుకు వ‌స్తే యావ‌త్ భార‌త‌మంతా వ్య‌తిరేకిస్తామ‌ని హెచ్చ‌రించారు తికాయ‌త్. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల బెంగ‌ళూరులో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా రాకేశ్ తికాయ‌త్ పై ఇంకుతో దాడికి పాల్ప‌డ్డారు.

దీంతో ఈ స‌మావేశానికి భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

Also Read : విద్వేష ప్ర‌చారం దేశానికి ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!