Rama Krishna Reddy Pinnelli: ఈవీఎంలు పగలగొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి !

ఈవీఎంలు పగలగొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి !

Rama Krishna Reddy Pinnelli: ఎన్నికల అనంతరం జరిగిన విధ్వంస కాండతో అట్టుడికిపోతున్న మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ రోజున జరిగిన ఘటనకు సంబంధించి… ఎలక్షన్ కమీషన్ విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎంలను పగలగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఎమ్మెల్యే పిన్నెల్లి(Rama Krishna Reddy Pinnelli)… ఈవీఎంలు పగలగొట్టి… అక్కడ సిబ్బందిని, టీడీపీ ఏజెంట్లను భయ బ్రాంతులకు గురిచేయడంతో పాటు టీడీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో సీసీటీవీలో నమోదైన దృశ్యాలపై ఎన్నికల కమీషన్ సీరియస్ గా స్పందించింది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనితో ఒక్కసారిగా మాచర్ల రాజకీయాలో వేడెక్కాయి.

Rama Krishna Reddy Pinnelli Case…

ఎమ్మెల్యే పిన్నెల్లి నిబంధనలకు విరుద్ధంగా అనుచరులతో పాటు పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళుతున్నా పోలీసులు, పోలింగ్‌ సిబ్బంది అడ్డుకోలేదు. ఆయన పోలింగ్‌ బూత్‌లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు. ఆయన నేరుగా పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారు. టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యేపైకి కూడా విసురుగా వెళుతుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు. ఈ ఘటనతో పోలింగ్‌ సిబ్బందితోపాటు, ఓటర్లు భీతావహులయ్యారు. ఎమ్మెల్యే ఈవీఎంను విసిరికొడుతున్న సమయానికి… ఎదురుగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేస్తున్న వ్యక్తి భయంతో బయటకు పారిపోవడం, మహిళా పోలింగ్‌ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో నంబూరి శేషగిరిరావుపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగా.. ఈవీఎంను ధ్వంసం చేసినప్పటికీ… పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలను ద్వంసం చేసారు అని కేసు నమోదు చేసారు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ బయటపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేసారు. దీనితో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని(Rama Krishna Reddy Pinnelli) నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీనితో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్‌ కుమార్‌ మీనాను ఆదేశించింది.

Also Read : Anand Mahindra Post : ఆనంద్ మహీంద్రా పోస్ట్ కి నెటిజన్ల రియాక్షన్ మాములుగా లేదుగా..

Leave A Reply

Your Email Id will not be published!