హైదరాబాద్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సంచలనంగా మారారు. తాను తాజాగా తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన రణబాలిలో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా తాజాగా తాను ఓ ఛానల్ తో ముచ్చటించారు రష్మిక మందన్నా. తన సినీ కెరీర్‌లో గ్లామర్, బోల్డ్ దుస్తులు , తాను పాటించే పరిమితుల గురించి బహిరంగంగా మాట్లాడారు. ప్రముఖ చిత్రనిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్‌తో జరిగిన సంభాషణలో, తన సౌకర్యానికి భంగం కలిగించేలా రాజీ పడకుండా, తన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని రష్మిక వివరించారు.
ఈ చర్చ రష్మిక , నటుడు విజయ్ దేవరకొండ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో జరిగింది. నటీమణులు తమ దుస్తులు , తెరపై కనిపించే తీరు విషయంలో ఎదుర్కొనే ఒత్తిడి గురించి కరణ్ జోహార్ ప్రస్తావించారు. ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ ధరించిన దుస్తుల గురించి ఇటీవల జరిగిన చర్చను కూడా ఆయన గుర్తు చేస్తూ రష్మిక కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారా అని అడిగారు. దర్శకులు, నిర్మాతల వద్ద పనిచేసేటప్పుడు తాను ఏవైనా పరిమితులు పెట్టుకుంటారా అని కరణ్ జోహార్ అడగగా రష్మిక స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తెరపై తాను ఎలా కనిపించాలని అనుకుంటున్నానో తనకు బాగా తెలుసని, దుస్తులు , గ్లామరస్ సన్నివేశాల విషయంలో తనకంటూ కొన్ని ప్రత్యేక ఇష్టాయిష్టాలు ఉన్నాయని ఆమె చెప్పారు.
కొన్ని పాత్రలకు కథాంశం దృష్ట్యా బికినీలు లేదా బోల్డ్ దుస్తులు అవసరం కావచ్చు. అయితే, అతిగా శరీరాన్ని ప్రదర్శించే దుస్తులు ధరించడం తనకు సౌకర్యవంతంగా అనిపించదని ఆమె పేర్కొన్నారు. తన వ్యక్తిత్వానికి సరిపడని విషయాల విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడనని ఆమె స్పష్టం చేశారు. వాణిజ్య చిత్రాల్లో (కమర్షియల్ సినిమాలు) కొన్నిసార్లు కథానాయికలు ప్రత్యేకమైన దుస్తులు ధరించాల్సి ఉంటుందని, ముఖ్యంగా పాటలు లేదా గ్లామరస్ సన్నివేశాల్లో ఇలాంటివి అవసరమవుతాయని ఆమె అంగీకరించారు. అటువంటి దుస్తులు ధరించినప్పుడు కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపించినప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ పరిమితులను అర్థం చేసుకోవడం ముఖ్యమని రష్మిక అభిప్రాయపడ్డారు.
