భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని ప్రశంసలతో ముంచెత్తాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. గతంలో జట్ల ఎంపికపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా వచ్చే జూన్ 7 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత్ తో జరగనుంది. దీంతో గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బీసీసీ సెలెక్షన్ కమిటీ తాజాగా 15 మందితో కూడిన టీమ్ ను ఎంపిక చేసింది.
గత కొంత కాలంగా ఫామ్ లేని కారణంగా దూరమైన భారత క్రికెటర్ అజింక్యా రహానేకు ఊహించని రీతిలో ఛాన్స్ ఇచ్చింది. ఇదే సమయంలో సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టింది. త్వరలోనే భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీనిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్ కొనసాగుతోంది.
ఇందులో ఊహించని రీతిలో తన సహజ సిద్దమైన ఆట తీరుకు భిన్నంగా ఆడుతున్నాడు అజింక్యా రహానే. భారీ షాట్స్ తో విరుచుకు పడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుండడంతో అతడిని ఎంపిక చేయక తప్పలేదు బీసీసీఐకి. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానేకు చోటు దక్కింది. ఈ సందర్భంగా బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు బాగుందని పేర్కొన్నాడు రవిశాస్త్రి.