#SunnamRajayya : మరిచి పోలేని మహానుభావుడు రాజయ్య
జనం కోసమే బతికిన అసాధారణ నాయకుడు
Sunnam Rajayya : బతుకు సంచారంలో కొందరు మనల్ని కట్టి పడేస్తారు. ఇంకొందరు మనతో పాటే కలిసి ప్రయాణం సాగిస్తారు. అంతకంటే ఎక్కువగా మన జ్ఞాపకాల్లో..కలల్లో సైతం మన గుండె లోతుల్ని తడుముతుంటారు. అలాంటి వారిలో సున్నం రాజయ్య ఒకరు. ఈ సమున్నత భారతదేశం ఎందరినో వీరులను, స్ఫూర్తి దాయకమైన నాయకులను అందించింది. ఎక్కడ ఆకలి ఉంటుందో..ఎక్కడ పీడన ఉంటుందో..ఎక్కడ సమస్త జనం అంతా ఆకలి కేకలతో అల్లాడుతుంటారో..ఎక్కడ దోపిడీ నాలుగు పాదాలను ఆక్రమించుకుని స్వైర విహారం చేస్తుందో అక్కడ కమ్యూనిజం తప్పక ఉంటుంది.
కేవలం ప్రజల కోసమే బతికిన వాళ్లను స్మరించుకోక పోతే నేరమవుతుంది. అతి పెద్ద భారమవుతుంది కూడా. వృత్తి పరంగా వివిధ రంగాలు, అంశాలు, సమస్యల గురించిన సమాచారం వెతకడం అన్నది తప్పనిసరి. ఇదే క్రమంలో కోట్లాది రూపాయలు వెనకేసుకుని, జనాన్ని బురిడీ కొట్టించే దగుల్బాజీలు, లంగలు, బట్టెబాజీగాళ్లు కోకొల్లలు. అందినంత మేర దండుకుని వందేళ్లకు సరిపడా నోట్లు, ఆస్తులను పోగేసుకునే రౌడీమూకలు లెక్కకు మించి ఉన్నారు.
వీరి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గత 35 ఏళ్లుగా ప్రపంచాన్ని, దేశాన్ని, ఆయా రాష్ట్రాలను పరిశీలిస్తూ వస్తే కేవలం కొద్ది మంది నాయకులు మాత్రమే గుర్తుకు వచ్చారు. ఇది ఒకరకంగా బాధ కలిగించింది. ఎంత వెదికినా నీతి, నిజాయితీ, నిబద్ధత, సేవాతత్పరత, జనం పట్ల ప్రేమతనం కలిగిన వారు అరుదుగా ఉండడం ఆశ్చర్యానికి లోను చేసింది. ఇదే క్రమంలో తెలుగు వాకిళ్లలో మనకంటూ చిరస్మరణీయమైన నాయకులు లేరా అన్న ప్రశ్న ఉదయించింది.
మరోసారి వెతికి వెతికి పట్టుకున్నా. వారిలో ఇద్దరు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే అగుపించారు. వారిలో ఆ ఇద్దరూ కూడా అట్టడుగు నుంచి వచ్చిన వారే. కాయకష్టం చేసుకునే వారే. ఇలాంటి వారు ఇంకా ఎందరో వుండి వుండవచ్చు. ఇదే సమయంలో ఒకరు సీపీఐ ఎంఎల్ పార్టీకి చెందిన గుమ్మడి నర్సయ్య కాగా మరొకరు భద్రాచలం నియోజకవర్గానికి చెందిన సున్నం రాజయ్య(Sunnam Rajayya). పార్టీలను పక్కన పెడితే..ఒక స్థాయికి ఎదిగిన వారిలో కొంత వ్యక్తిగతమైన అభిప్రాయాలతో పాటు స్వంత వ్యక్తిత్వం కూడా ఇమిడి ఉంటుంది.
వీరిద్దరిని పనిగట్టుకుని కలిశా. ఇది జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకం. ఎలాంటి భేషజాలు లేకుండా సాదా సీదాగా తమ పనేదో తాము చేసుకుంటూనే నిరంతరం కుటుంబానికంటే ఎక్కువగా సమాజాన్ని, ప్రజలతో కలిసే ఉన్నారు. కన్నీళ్లను తుడిచేందుకు ప్రయత్నం చేశారు. మారిన రాజకీయ పరిణామాలలో గ్రామ సర్పంచులే కరోడ్ పతులయ్యారు. వీరిద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచినా తాము మట్టి మనుషులమేనంటూ జనానికి స్పష్టం చేశారు.
పదవి అన్నది కారులోనో లేక భవంతుల్లోను ఉంటే పొరపాటు మన పనితీరే మనల్ని గుర్తించేలా చేస్తుందని వంద శాతం నమ్మిన అసమాన్యులు. అసాధారణమైన ప్రజా సేవకులు. పది కాలాల పాటు గుండెల్లో భద్రంగా దాచుకోవాల్సిన వాళ్లు. ప్రతి క్షణం జనం జపం చేసిన సున్నం రాజయ్య(Sunnam Rajayya) ఇంకొంత కాలం బతికి వుంటే బావుండేది. పేదలు, సామాన్యులకు ఇంకొంత అండ దొరికేది.
మహమ్మారి కరోనా ఆయనను ఉండనీయకుండా తీసుకెళ్లింది. ఆగస్టు నెలలో పుట్టిన ఆయన ఇదే నెలలో తనువు చాలించారు. 60 ఏళ్ల పాటు ప్రజా నాయకుడిగా..సేవకుడిగానే ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఇక సెలవంటూ వెళ్లి పోయారు. గూడెం బిడ్డల గొంతుకను ఆయన చట్ట సభలో వినిపించారు. తనదైన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. ఎప్పుడూ కూడా రాజీ పడలేదు. అదే ఆయన జెండా ఎజెండా కూడా.
సిపిఎం నుంచి 1999, 2004, 2014లలో భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో పార్టీ తరపున భద్రాచలం స్థానం నుండి పార్లమెంటుకు పోటీచేసి కుంజా సత్యవతి చేతిలో 6956 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రాష్ట్ర విభజన తర్వాత పాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో రాజయ్య సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేసి గెలవలేక పోయారు. స్వంత వాహనం అంటూ లేకుండానే శాసనసభకు కాలినడకన, ఆటోలో వచ్చిన అరుదైన నాయకుడు రాజయ్య. 2015 ఏప్రిల్ 9 గురువారం జరిగిన సంఘటన ఎందరినో ఆశ్చర్య పోయేలా చేసింది. గిరిజన నాయకుడిగా, సీపీఎం శాసనసభా పక్ష నేతగా సుపరిచితుడైన రాజయ్యను సచివాలయం ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
కారణం.. ఆయన సామాన్యులు ప్రయాణించే ఆటోలో వెళ్ళడమే. గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు.. ఆటోలో వచ్చావ్.. నువ్వు శాసన సభ్యుడివంటే మేము నమ్మం అనడంతో తన గుర్తింపు కార్డు తీసి చూపారు రాజయ్య. కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట గానీ ఆయనను పోలీసులు లోనికి అనుమతించలేదు.
భాగ్యనగర వీధుల్లో క్యాంటీన్ల వద్ద అందరితో కలిసి భోజనం చేసిన సామాన్యుడు. ఇలాంటి వారు మట్టిలో కలిసి పోవడం..మన మధ్య లేక పోవడం అత్యంత బాధాకరం. రాజయ్య..నువ్వు నిజంగా రాజువయ్య ..అంటూ గూడెం వాసులు గోడుమంటున్నరు.
No comment allowed please