Rishabh Pant : ప్రధాని మోదీ ముందు భావోద్వేగానికి గురైన ‘రిషబ్ పంత్’

ఏడాదిన్నర క్రితం నేను ఘోర ప్రమాదానికి గురయ్యా...

Rishabh Pant : దాదాపు రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన యువ క్రికెటర్ రిషభ్ పంత్ దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. అసలు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడం కూడా అనుమానంగా మారిన పరిస్థితి. అలాంటి స్థితిలో కఠోర శ్రమ చేసిన పంత్(Rishabh Pant) తిరిగి ఫిట్‌నెస్ సాధించి ఈ ఏడాది ఐపీఎల్‌లో మైదానంలోకి దిగాడు. బ్యాట్‌తో రాణించి పరుగులు చేశాడు. అనంతరం టీ20 ప్రపంచకప్‌ లో కూడా సత్తా చాటి టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. తాజాగా టీమిండియా క్రికెటర్లు ప్రధాని మోదీని కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రిషబ్ పంత్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

Rishabh Pant Comment

“ఏడాదిన్నర క్రితం నేను ఘోర ప్రమాదానికి గురయ్యా. నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా? లేదా? అనే సందేహాలు చుట్టు ముట్టాయి. మళ్లీ కీపింగ్ చేయడం కష్టమనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆ సమయంలో మీరు (ప్రధాని) ఫోన్ చేసి మాట్లాడినట్టు మా అమ్మ చెప్పింది. ఎప్పుడైతే మీరు ఫోన్ చేశారని మా అమ్మ చెప్పిందో.. అప్పుడు నేను మానసికంగా రిలాక్స్ అయ్యా. నాకే సమస్యా లేదనిపించింది. కష్టపడి ఫిట్‌నెస్ సాధించి మైదానంలో అడుగుపెట్టాన” అని పంత్ తెలిపాడు. ఆ రోజు పంత్ తల్లి చూపించిన ధైర్యం చాలా గొప్పదని మోదీ కొనియాడారు. “నేను మీ అమ్మగారితో మాట్లాడిన తర్వాత డాక్టర్లతో కూడా మాట్లాడా. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విదేశాలకు కూడా పంపుదామని చెప్పా. కానీ, అమ్మగారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆవిడ నాకు ధైర్యం చెబుతున్నట్టు మాట్లాడారు. అలాంటి తల్లి ఉన్న ఎవరైనా అదృష్టవంతులే. అంతటి పెద్ద ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగు పెట్టిన నవ్వు ఎంతో మందికి స్ఫూర్తి” అంటూ మోదీ ప్రశంసించారు.

Also Read : Buddha Venkanna : టీడీఆర్ బాండ్ల కుంభకోణం లో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!