Same Sex Comment : స్వలింగ వివాహం చట్ట బద్దం
సమాజానికి ఆమోద యోగ్యమేనా
Same Sex Comment : స్వలింగ సంపర్క వివాహానికి చట్టబద్దత కల్పించే అంశం మరోసారి తెర పైకి వచ్చింది. ఇది చాలా సున్నితమైన అంశం. ప్రత్యేకించి వివాహ వ్యవస్థను అత్యంత పవిత్రంగా భావించే భారత దేశంలో దీనిని పాపంగా, నేరంగా పరిగణిస్తారు. ఇందుకు సంబంధించి పలువురు పిటిషన్లను దాఖలు చేశారు. వారంతా భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులు కలిగిన ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ సందర్భగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సేమ్ సెక్స్(Same Sex Comment) మ్యారేజ్ అనేది శరీరాలకు లేదా జననాంగాలకు సంబంధించినదిగా చూడలేమని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఆలోచించాల్సిన అంశం.
ఇందుకు సంబంధించి కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించింది. సర్కార్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ముందు హిందూ మతం , ఇస్లాం మతంలో స్వలింగ సంపర్క వివాహాలకు చోటు లేదని ఇది భారత దేశం తాను రూపొందించుకున్న రాజ్యాంగంలో , చేసిన శాసనాల్లో ప్రస్తావించిన దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సీజేఐ. ఎవరైనా తనను డిక్టేట్ చేయజాలరంటూ కేంద్రాన్ని తప్పు పట్టారు. ప్రతి కోణానికి రెండు వైపులా చూడాలని, అది చట్టం చూసుకుంటుందని స్పష్టం చేశారు. వ్యతిరేక భావనతో ఉండడం అనేది సమస్యకు పరిష్కారం చూపదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ప్రత్యేక వివాహ చట్టాన్ని ప్రస్తావించారు. పురుషుడు, స్త్రీ అనే భావన జననేంద్రియాలపై ఆధారపడిన సంపూర్ణమైనది కాదని స్పష్టం చేశారు సీజేఐ. ప్రధానమైన అంశం స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట పరమైన ధ్రువీకరణ కోరడం. వివాహాలను నియంత్రించే వ్యక్తిగత చట్టాల జోలికి తాము వెళ్లబోమంటూ కుండ బద్దలు కొట్టింది ధర్మాసనం. సీజే అభ్యంతరం తెలిపారు. ట్రాన్స్ జెండర్లపై చట్టాలను ప్రస్తావించారు.
భాగస్వాములను ఎంచుకునే హక్కు, గోప్యతను పాటించే హక్కు, లైంగిక(Same Sex Comment) ధోరణిని ఎంచుకునే హక్కు వంటి అనేక హక్కులు ఉన్నాయని తెలిపారు. ఏదైనా వివక్ష నేరపూరితంగా విచారణ చేయబడుతుందన్నారు. వివాహానికి సంబంధించిన సామాజిక చట్ట పరమైన హోదాను న్యాయ పరమైన నిర్ణయాల ద్వారా చేయడం సాధ్యం కాదన్నారు తుషార్ మెహతా. హిందువులు, ముస్లింలు, ఇతర వర్గాలు ప్రభావితం అవుతాయని చెప్పారు. సమాజంలో ఎల్లప్పుడూ మార్పు ఉంటుంది. అది ఎక్కడి నుండైనా ప్రారంభం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ చంద్రచూడ్.
ఈ సందర్బంగా గతంలో సెక్షన్ 377 పై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఇక్కడ ప్రస్తావించాలి. వ్యక్తుల లైంగిక స్వభావం అంతర్గతమైనది. అతడు లేదా ఆమె ఎవరి పట్ల ఆకర్షితులవుతారన్న దానిపై వారికి నియంత్రణ ఉండదు. దానిని అణిచి వేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేసింది.
శరీర లక్షణాలు అన్నవి ప్రత్యేకమైనవి. అవి వారికి సంబంధించినవి. వారి ఆత్మ గౌరవంలో ఒక భాగం. ఇది ఆర్టికల్ 14 ఉల్లంఘనేనని పేర్కొంది. మిగిలిన పౌరులకు లాగానే ఎల్జీబీటీ కమ్యూనిటీకి లైంగిక హక్కులు ఉన్నాయని తీర్పు చెప్పింది. మొత్తంగా స్వలింగ సంపర్క వివాహం చట్ట బద్దం అన్నది ఇంకా తేలని ప్రశ్నగా మిగిలి పోయింది.
Also Read : డిక్టేట్ చేస్తానంటే ఊరుకోను – సీజేఐ