Sanitary Napkins Comment : ‘న్యాప్ కిన్స్’ ఫ్రీగా ఇవ్వలేమా
50 శాతానికి పైగా నేటికీ వస్త్రాలే గతి
Sanitary Napkins Comment : దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. ఉత్సవాలలో మునిగి పోయాం. కానీ తరాలు మారినా, టెక్నాలజీ విస్తరించినా మనిషి జీవన గమనంలో కీలకంగా ఉంటూ వస్తున్న మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది.
ఇది బాధాకరం. అన్నింటికంటే ఎక్కువగా విస్తు పోయేలా చేస్తున్నది ఒక్కటే. నెల నెలా వచ్చే రుతుక్రమం. దీనినే పీరియడ్స్ అంటారు.
యుక్త వయస్సు నుంచి 50 ఏళ్ల కంటే పైబడిన వారంతా ప్రతి నిత్యం ఎదుర్కొనే అంతర్గత సమస్య. నేటి ఆధునిక యుగంలో ప్రత్యేకించి భారత దేశంలో బాలికలు, యువతులు, మహిళలు దీని కారణంగా చెప్పుకోలేని రోగాలకు గురవుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ, నగర ప్రాంతాలలో సైతం ఇదే సమస్య కొనసాగుతూ వస్తున్నది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు నీళ్లకంటే వేగంగా ఖర్చు
చేస్తున్న ప్రభుత్వాలు మహిళల కోసం ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్ ను ఎందుకు ఇవ్వడం లేదో ఆలోచించు కోవాలి.
ఇది పక్కన పెడితే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. నేటికీ భారత దేశంలో 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్త్రీలలో దాదాపు 50 శాతం మంది పీరియడ్స్ సమయంలో శానిటరీ న్యాప్ కిన్లను వాడడం లేదు.
తమకు దగ్గరలో లభించే వస్త్రాల (దుస్తులు)ను ఉపయోగిస్తున్నారని తేలింది. తాజాగా ఓ మహిళా న్యాయవాది ఏకంగా ఢిల్లీ కోర్టు జడ్జీకే లేఖ రాసింది.
తనకు అవసరమై కోర్టు ప్రాంగణంలోని డిస్పెన్సరీకి వెళితే శానిటరీ న్యాప్ కిన్లు లేవని చెప్పారని వాటిని ఉంచేలా ఆదేశించాలని కోరింది.
ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దుస్తులు వాడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ప్రతి నెలా నాలుగు లేదా ఐదు రోజుల పాటు ఈ పీరియడ్స్ వస్తాయి.
ప్రధానంగా న్యాప్ కిన్స్(Sanitary Napkins) లేక చాలా మంది బాలికలు బడులకు వెళ్లడం లేదు. న్యాప్ కిన్లను ఉపయోగించాలని ఉన్నా కొనేందుకు డబ్బులు లేక పోవడం, ఉన్నా వాటిని వాడుకునే అవగాహన లేక పోవడం ప్రధాన కారణం.
వ్యక్తిగత పరిశుభ్రత అనేది ముఖ్యం. దీనిని పాటించక పోతే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. 14 నుంచి 24 ఏళ్లలో
ఎక్కువ మంది గర్భాశయ క్యాన్సర్ కు గురవుతున్నట్లు తేలింది.
64.4 శాతం మంది శానిటరీ న్యాప్ కిన్ లను , 49.6 శాతం దుస్తులను , 15 శాతం మంది స్థానికంగా తయారు చేసిన న్యాప్ కిన్ లను ఉపయోగిస్తున్నారు. 0.3 శాతం మంది మాత్రమే మెన్ స్ట్రేవల్ కప్పులను ఉపయోగిస్తున్నారు.
కొందరు వాడిన వాటినే తిరిగి వాడడం వల్ల ఎక్కువ శాతం ఇన్ ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. 10 గంటలకు పైగా వాడుతున్నట్లు తేలింది. పదే పదే వాడుతూ సరిగ్గా ఉతకక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని నిఫుణులు హెచ్చరిస్తున్నారు.
పీరియడ్స్ , ఆ సమయంలో ఎలాంటి పద్దతులు అవలంభించాలి అనే దానిపై అవగాహన కూడా అవసరం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఉచితంగా ఇచ్చేలా చూడాలి. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని తెలుసు కోవాలి.
Also Read : గర్భాశయ క్యాన్సర్ కోసం స్వదేశీ వ్యాక్సిన్