రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో జట్టు సమిష్టిగా రాణించిందని కితాబు ఇచ్చాడు. బౌలింగ్ పరంగా బౌలర్లు తమ సత్తా చాటారని, ప్రధానంగా యుజ్వేంద్ర చాహల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు.
ఐపీఎల్ లో ప్రతి బంతి, ప్రతి పరుగు అత్యంత కీలకమని పేర్కొన్నాడు. ఒక్కోసారి బలమైన జట్లు బలహీనంగా మారుతుంటాయని ఇదే పొట్టి ఫార్మాట్ కు ఉన్న ప్రత్యేకత అని కితాబు ఇచ్చాడు. యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అయితే 2 పరుగుల దూరంలో సెంచరీ మిస్ కావడాన్ని ప్రస్తావించాడు సంజూ శాంసన్.
తమ మేనేజ్ మెంట్ , హెడ్ కోచ్ లక్ష్యం ఒక్కటే. జట్టు అంటేనే ఆటగాళ్ల కలయిక. వ్యక్తిగత రికార్డుల కంటే తమకు తమ టీమ్ విజయం సాధించడమని స్పష్టం చేశాడు. ట్రోల్స్ చేసినా, లేక ఇతరులు గేలి చేసినా తాను పట్టించుకోనని పేర్కొన్నాడు. ఆటను ఆస్వాదించడం, సాధ్యమైనంత మేర ఆహ్లాదకరమైన వాతావరణంలో మ్యాచ్ ను పూర్తి చేయాలని అనుకుంటామని చెప్పాడు.
ప్లే ఆఫ్ రేసులో నిలవడం ఒకింత సంతోషంగా ఉందని తెలిపాడు. రాబోయే మ్యాచ్ లు తమకు అత్యంత ముఖ్యమన్నాడు రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్.
