Sankranthi : ప్రపంచంలోని తెలుగు వారి లోగిళ్లలో సంక్రాంతి పండుగ శోభాయమానంగా విరాజిల్లుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ అరుదైన పండగ గురించి ఎంత చెప్పినా తక్కువే.
కొత్త ధాన్యం ఇంటికి చేరే వేళ..గంగిరెద్దుల విన్యాసాలు, కోళ్ల పందాలు, పిల్లలు, పెద్దలు కలిసి ఎగరవేసే పతంగులు,
ఆడ పడుచుల గొబ్బెమ్మలు, పిండి వంటల ప్రత్యేకతలు, రంగ రంగుల ముగ్గులు ఇలా ప్రతి దానికీ సంక్రాంతి ప్రత్యేకం.
నిత్యం నిండు గర్భిణీలాగా ఉండే భాగ్యనగరం పూర్తిగా సగానికి పైగా ఖాళీ అయ్యింది. కేవలం ఈ ఒక్క పండగ కోసమే.
ఇక పండగ గురించి చెప్పాల్సి వస్తే ఎలాంటి తిథులతో సంబంధం లేకుండా ప్రతి ఏటా జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలో తప్పకుండా వచ్చే పండగ ఇది.
ఎక్కడా తేదీలు మారని పండగ ఏదైనా ఉందంటే సంక్రాంతి (Sankranthi)మాత్రమే. ఈ పండగను ఇరు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరుపుకుంటారు తెలుగు వారు.
ప్రత్యేకించి ఆంధ్రలో ఈ పండగకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. సంక్రాంతి పండగను మూడు రోజుల పండగగా జరుపు కోవడం తర తరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.
ముందు రోజు భోగి రెండో రోజు సంక్రాంతి (Sankranthi)మూడో రోజు కనుమ పేరుతో ఈ పండుగను అత్యంత సుఖ సంతోషాలతో జరుపుకుంటారు తెలుగవారంతా. సంప్రదాయాలను,
ఆచార వ్యవహారాలను , సామాజిక స్పృహను , నైతిక విలువలను తెలియ చేసేదే ఈ పండగ.
కొత్త అల్లుళ్లు, బంధువులు, సకుటుంబ సపరివారంతో నిండుగా తెలుగు వారి ఇళ్లన్నీ కళకళలాడుతాయి.
గంగిరెద్దుల విన్యాసాలు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
అయ్య వారికి దండం పెట్టు అమ్మ గారికి దండం పెట్టు అంటూ చూపరులను ఆకట్టుకుటాయి. హరిదాసుల కీర్తనలతో ఆనందింప చేస్తారు.
అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ ఆశీర్వదిస్తారు. అందరినీ ఆనందింప చేస్తారు. హర హర మహాదేవ అంటూ శివ నామ సంకీర్తనలతో జంగమ దేవరలు వస్తారు.
ఇది ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. ఇక పిల్లలు, యువతీ యువకులు కేరింతలు కొడతారు. కొత్త దుస్తులు ధరించి గాలి పటాలను ఎగుర వేస్తారు.
పాడి పంటలను ఇచ్చే గోవులు, ఎద్దులను కనుమ రోజు పూజించడం అనాదిగా వస్తోంది.
Also Read : ఆదర్శప్రాయుడు వివేకానందుడు