Satya Pal Malik : ఖాకీల దాడిపై మాలిక్ మండిపాటు
పోలీసుల తీరు దారుణం
Satya Pal Malik : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన రెజ్లర్లను అర్ధరాత్రి ఢిల్లీ ఖాకీలు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆపై దురుసుగా ప్రవర్తించారు.
ఈ విషయాన్ని స్వయంగా మహిళా రెజ్లర్లు వాపోయారు. ఆవేదన చెందారు. ఒకరు స్పృహ తప్పి పడి పోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు జమ్మూ , కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) . పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. న్యాయ బద్దంగా ఆందోళన చేపట్టారని, ఇందులో తప్పేమీ లేదన్నారు మాజీ గవర్నర్.
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను హెచ్చరించారు. మద్యం తాగి రావడమే కాక మహిళా రెజ్లర్లను వేధింపులకు గురి చేయడం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సత్య పాల్ మాలిక్. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే శుక్రవారం రైతులు ఢిల్లీని ముట్టడిస్తారని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) ప్రస్తుతం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత కొంత కాలం నుంచి కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన ప్రధానిని టార్గెట్ చేశారు. ఇదే సమయంలో సాగు చట్టాల విషయంలో ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతుగా నిలిచారు.
Also Read : బేటీ బచావో అనేది ఓ వంచన – రాహుల్