Ramdas Athawale : షీజన్ ఖాన్ కు శిక్ష తప్పదు – అథవాలే
కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
Ramdas Athawale : కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. యువ నటి తునీషా శర్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా తల్లి వనితా శర్మ, తండ్రితో మాట్లాడారు. వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అనంతరం రాందాస్ అథవాలే మీడియాతో మాట్లాడారు. తునీషా శర్మ సూసైడ్ కేసును పోలీసులు విచారిస్తున్నారని, ఇందులో కీలక నిందితుడిగా భావిస్తున్న సహ నటుడు షీజన్ ఖాన్ కు ఉరి శిక్ష తప్పదన్నారు. మహిళల పట్ల ఎవరు తల తిక్క వేషాలు వేసినా లేదా ఇబ్బందికరంగా ప్రవర్తించినా చర్యలు తప్పవంటూ కేంద్ర మంత్రి(Ramdas Athawale) హెచ్చరించారు.
దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎక్కడా తాత్సారం చేయడం లేదన్నారు. తునీషా శర్మ ఆత్మహత్య చేసుకున్నదా లేక హత్య చేసి సూసైడ్ గా చిత్రీకరించేందుకు యత్నించారా అన్నది త్వరలో తేలుతుందన్నారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే(Ramdas Athawale).
షీజన్ ఖాన్ ఆమెకు తీరని ద్రోహం తలపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి శిక్ష వేయడం మాత్రమే ఆమెకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడి భారీగా నష్ట పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : తునీషా శర్మను షీజన్ ఖాన్ కొట్టాడు