గుజరాత్ లోని అహ్మాదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. ఆరంభంలోనే 2 వికెట్లు త్వరగా కోల్పోయినా ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంలో సక్సెస్ అయ్యాడు గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్. ఐపీఎల్ 16వ సీజన్ లో నిలకడగా ఆడుతూ వస్తున్నాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ కు కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు శుభ్ మన్ గిల్.
ప్రతి మ్యాచ్ లో కనిసిస్టెంట్ గా ఆడుతూ అలరిస్తున్నాడు. ముంబై బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు గిల్. కేవలం 34 బంతులు మాత్రమే ఆడిన శుభ్ మన్ గిల్ 56 రన్స్ చేశాడు. గుజరాత్ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు గుజరాత్ బ్యాటర్లలో మరోసారి సత్తా చాటాడు డేవిడ్ మిల్లర్ . కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతులు మాత్రమే ఎదుర్కొని 46 రన్స్ చేశాడు. ఇక అభినవ్ మనోహర్ తానేమీ తక్కువ కాదంటూ 21 బాల్స్ ఎదుర్కొని 42 పరుగులు చేశాడు.
ఇక బౌలింగ్ పరంగా ఆఫ్గనిస్తాన్ బౌలర్లు సత్తా చాటారు. మరోసారి గుజరాత్ కు విజయాన్ని చేకూర్చి పెట్టడంలో కీలకంగా మారారు. రషీద్ ఖాన్ 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు.