ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయాన్ని సాధించింది. చివరి దాకా నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొనసాగింది. వార్నర్ మామ సన్ రైజర్స్ హైదరాబాద్ పై ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు.
గతంలో ఎస్ ఆర్ హెచ్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టుకు తొలిసారిగా తన సారథ్యంలోని ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. ఆ తర్వాత అనూహ్యంగా తొలగింపునకు గురయ్యాడు వార్నర్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ కెప్టెన్ వార్నర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ వార్నర్ 21 , మిచెల్ మార్ష్ 25, మనీష్ పాండే 35, అక్షర్ పటేల్ 34 రన్స్ చేశారు.
మిగతా ప్లేయర్లు ఎవరూ రాణించ లేక పోయారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2, వాషింగ్టన్ సుందర్ 3, నటరాజన్ కు ఒక వికెట్ పడింది.
అనంతరం 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్నిసాధించింది.
