న్యూఢిల్లీ : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నాయకులు సౌరవ్ దాస్ , అశుతోష్ రాంకాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఓ వైపు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ గురువారం ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. జంతర్ మంతర్ నిరసన కేసులో విచారణ నిమిత్తం ఈరోజు మధ్యాహ్నం తమ ముందు హాజరు కావాలని పోలీసులు వీరిని ఆదేశించారు. వీరితో పాటు అజింక్య షిండేకు కూడా సమన్లు జారీ అయ్యాయి. అక్టోబర్ 13న జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుండి తొలగించినప్పటికీ, అక్కడకు ప్రవేశించినందుకు గాను సీజేపీ నాయకులతో పాటు మరో 11 మందిపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని (బాండ్) ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా వారిపై ఉన్నాయి.
ఢిల్లీ పోలీసులు వీరినందరినీ అదుపులోకి తీసుకున్నారు. అజింక్య షిండే బెయిల్ బాండ్‌పై విడుదల కాగా, సౌరవ్ దాస్ , అశుతోష్ రాంకా వారం రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్ మంతర్‌ను తిరిగి అధికారిక నిరసన ప్రదేశంగా ప్రకటించే వరకు, అక్కడ ఎటువంటి నిరసనలకు పిలుపు ఇవ్వబోమని సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఒక కొత్త బాండ్‌పై సంతకాలు చేశారు.
తాము శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించబోమని వారు తమ రాతపూర్వక హామీ పత్రాల్లో పేర్కొన్నారు.
