Supreme Court of India: ఎఫ్‌ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం అంటూ నిలదీసిన సుప్రీంకోర్టు !
ఎఫ్‌ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం అంటూ నిలదీసిన సుప్రీంకోర్టు !
Supreme Court of India: యావత్తు దేశాన్ని నిర్ఘాంతపరిచిన కోల్ కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. ఆర్.జి.కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను అత్యంత పాశవికం, భయంకరమైనదిగా పేర్కొంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. నేర స్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను మంగళవారం సుమోటోగా విచారణకు చేపట్టింది. ఈ నెల 22లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం(Supreme Court of India) ఆదేశించింది. ఆసుపత్రిపై అల్లరి మూక దాడిని నివారించడంలో ప్రభుత్వ, పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించడంతో పాటు నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదించాలని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఆదేశించింది. బాధితురాలి పేరు, ఫొటో, మృతదేహం వీడియో దృశ్యాలు మీడియాలో రావడంపై ఆవేదన వ్యక్తం చేసింది.
Supreme Court of India – విధుల్లోకి రావాలని వైద్యులకు సూచన
హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనకు దిగిన వైద్యులు తిరిగి విధుల్లోకి రావాలని సుప్రీంకోర్టు(Supreme Court of India) ధర్మాసనం కోరింది. ఆసుపత్రుల్లో భద్రతపై గట్టి చర్యలు తీసుకుంటామని, తమను విశ్వసించమని విజ్ఞప్తి చేసింది. కోల్‌కతాలోని ఆర్.జి.కార్ ఆసుపత్రి వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హత్యాచార ఘటనను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళనకు దిగిన వారిపట్ల బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ధర్మాసనం తప్పుబట్టింది. తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.
‘ప్రస్తుతం ఉన్న చట్టాలు వైద్యులు, వైద్య రంగంలోని ఉద్యోగులకు భద్రత వాతావరణాన్ని కల్పించడం లేదు. వైద్యుల భద్రత కోసం జాతీయ కార్యదళం (నేషనల్ టాస్క్‌ఫోర్స్-ఎన్టీఎఫ్) ఏర్పాటు చేస్తున్నాం’ అని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయ నిబంధనలను రూపొందించడానికి ఎన్టీఎఫ్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరించారు. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్ నేతృత్వం వహించే ఈ కార్యదళంలో ప్రముఖ వైద్యులు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్టీఎఫ్‌ను ధర్మాసనం(Supreme Court of India) ఆదేశించింది.
అంత ఘోరాన్ని ఆత్మహత్య అని ఎలా చెప్పారు ?
హత్యాచార ఘటనను తెల్లవారు జామున గుర్తించినట్లు తెలుస్తోంది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు ? అతని ప్రవర్తనపై అనుమానాలున్నప్పుడు.. వెంటనే మరో కళాశాలకు ఎలా బదిలీ చేశారు? ఎఫ్‌ఐఆర్ నమోదూ ఆలస్యమైంది. మధ్యాహ్నం 1.45 నుంచి 4 గంటల మధ్య శవ పరీక్ష పూర్తయ్యింది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది ? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటివరకు ఏం చేస్తున్నారు? మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల పాటు వేచిచూసేలా ఎందుకు చేశారు ? కేసు దర్యాప్తు స్థాయీ నివేదికను ఈ నెల 22లోపుసమర్పించాలి.
Also Read : YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ కేసులపై విచారణ మరోసారి వాయిదా